
చోరీపై కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: స్థానిక పద్మ థియేటర్ సమీపంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. మాచవరపు రాము ఈ నెల 12న కుటుంబసభ్యులతో విశాఖపట్నం వెళ్లాడు. ఈ నెల 17న తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉంచిన బంగారు చెవిదుద్దులు, చైన్ చోరీకి గురైనట్లు గుర్తించారు. కేసు నమోదుచేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు.
భీమవరం: అండర్–19 బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు టి.జ్ఞానేశ్వర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని సోమవారం భీమవరం విష్ణు కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ వెల్లడించారు. జ్ఞానేశ్వర్ గన్నవరం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఈ నెల 17న జరిగిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటడంతో అతన్ని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారని చెప్పారు.
పాలకొల్లు సెంట్రల్: క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సప్తప్రదక్షిణల్లో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రదోషకాలంలో భక్తులు ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ప్రదక్షిణల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాత్రి 7.30 గంటలకు స్వామికి పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, ఆలయ అర్చకులు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
ముదినేపల్లి రూరల్: భార్యతో పాటు ఇద్దరు బిడ్డలు కనిపించకుండా పోయారంటూ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని శ్రీహరిపురానికి చెందిన సనక రవీంద్ర తాపీపని చేస్తుంటాడు. రవీంద్ర, భార్య లక్ష్మీశిరీష మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 15న భార్య లక్ష్మీశిరీష తనతో పాటు కుమారులను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. గ్రామంలో వెతకడంతో పాటు అత్తమామలను విచారించగా తమ వద్దకు రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో భార్యపిల్లలు కనిపించడం లేదంటూ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
జంగారెడ్డిగూడెం: యుువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. స్థానిక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువతి ఈనెల 17వ తేదీ ఉదయం కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.