టెంకాయ అ‘ధర’హో | - | Sakshi
Sakshi News home page

టెంకాయ అ‘ధర’హో

Aug 18 2025 5:33 AM | Updated on Aug 18 2025 5:33 AM

టెంకా

టెంకాయ అ‘ధర’హో

ధరలను నియంత్రించాలి

విక్రయాలు తగ్గాయి

ద్వారకాతిరుమల: కొబ్బరికాయల ధరలు టాపు లేపుతున్నాయి. ఆలయాల వద్ద సైజును బట్టి రూ.25 నుంచి రూ.40కు విక్రయిస్తుండడంతో భక్తులు షాక్‌ అవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తారు. అందులో అధిక శాతం మంది భక్తులు ఆలయంలో కొబ్బరికాయలు కొడతారు. అయితే కొబ్బరి కాయల ఉత్పత్తి తగ్గడంతో గత మూడు నెలల క్రితం వాటి ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుత శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలు జరుపుకునేవారు, ఆలయాల్లో మొక్కులు తీర్చుకునే సాధారణ భక్తులు కొబ్బరికాయలు కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరగక ముందు వ్యాపారులు దళారుల వద్ద రూ.10 లకు కొన్న కొబ్బరి కాయను రూ.15కు, రూ.15 కాయను రూ.20 నుంచి రూ.25కు విక్రయించేవారు. ప్రస్తుతం దళారుల వద్ద రూ.20కు కొన్న కాయను రూ.25కు, రూ.25 కాయను రూ.30 నుంచి రూ.40కు అమ్ముతున్నారు. దాదాపు అన్ని ఆలయాల వద్ద ఇదే పరిస్థితి ఉంది.

నెలకు 50 వేలకు పైగా విక్రయాలు

శ్రీవారి క్షేత్రంలో చిన్నాపెద్దా మొత్తం 15 వరకు కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా వ్యాపారులు నెలకు 50 వేలకు పైగా కొబ్బరి కాయలు విక్రయిస్తారు. అయితే కొబ్బరికాయలు ధరలు బాగా పెరగడంతో గత మూడు నెలల నుంచి విక్రయాలు బాగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అవసరమైన వారు తప్పక కొబ్బరికాయలు కొంటున్నారు. కొందరు భక్తులైతే కొబ్బరికాయలు కొనకుండా ఆ డబ్బులను స్వామివారి హుండీల్లో వేసి దండం పెట్టుకుంటున్నారు.

ఎండు కొబ్బరి, నూనె ధరలకు రెక్కలు

కొబ్బరి కాయల ధరలు పెరగడంతో ఎండు కొబ్బరి, నూనె ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత మూడు నెలల క్రితం కిలో ఎండు కొబ్బరి రూ.240 పలికితే, ప్రస్తుత మార్కెట్లో రెట్టింపై రూ.400కు చేరింది. కిలో కొబ్బరి నూనె గతంలో రూ.360 కాగా, ప్రస్తుత మార్కెట్లో రూ.500 పలుకుతుండటం విశేషం. కొబ్బరికాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

టాపు లేపుతున్న కొబ్బరికాయ ధర

సైజును బట్టి రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయాలు

శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు క్షేత్రానికి వచ్చాను. కొండ కింద చిన్న కొబ్బరికాయను రూ.25కు కొన్నాను. ఆలయం వద్ద ఉన్న దుకాణంలో అడిగితే రూ.30, పెద్ద కాయ రూ.40 చెప్పారు. శివాలయం వద్ద షాపులో రూ.40కు అమ్ముతున్నారు. ఇదేంటని వ్యాపారులను అడిగితే మార్కెట్‌లో కొబ్బరికాయల ధరలు పెరిగాయని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – తమ్మిరెడ్డి కృష్ణ, భక్తుడు, కై కలూరు

దళారుల వద్ద మేము చిన్నకాయను రూ.20కు కొంటున్నాము. వాటిని అమ్మడం చాలా కష్టంగా ఉంది. సామాన్య భక్తులు అంత ధర పెట్టి కొనడానికి ఇష్టపడటం లేదు. మొక్కులు తీర్చేవారు మాత్రమే కొబ్బరి కాయలు కొంటున్నారు. పెద్ద కాయ రూ.30 చెబుతుంటే వారు హడలిపోతున్నారు. విపరీతంగా పెరిగిన ధరల వల్ల విక్రయాలు బాగా తగ్గాయి.

– యండపల్లి వీరయ్య, కొబ్బరికాయల వ్యాపారి, ద్వారకాతిరుమల

టెంకాయ అ‘ధర’హో 1
1/3

టెంకాయ అ‘ధర’హో

టెంకాయ అ‘ధర’హో 2
2/3

టెంకాయ అ‘ధర’హో

టెంకాయ అ‘ధర’హో 3
3/3

టెంకాయ అ‘ధర’హో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement