
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం– జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాలకొల్లు నుంచి తెలంగాణ రాష్ట్రం బైసంకి వెళుతుండగా పవర్ గ్రిడ్ వద్దకు వచ్చేసరికి కొబ్బరికాయల లోడు ఒక వైపునకు ఒరిగింది. దీంతో డ్రైవర్ నవ్వుండ్రి రాజేష్ (30), తొడ దాసి లక్ష్మణరావు (35) లారీని రోడ్డు మార్జిన్ వైపునకు ఆపి లోడును సరి చేస్తుండగా కలకత్తా నుంచి హైదరాబాదు వెళుతున్న మరో లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్‌ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం అయ్యాయి. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి చంద్రశేఖర్ తెలిపారు.
దెందులూరు: ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తూ ఓ మహిళ జారి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ఆదివారం ద్విచక్రవాహనంపై ఏలూరు వైపు భార్యభర్తలు వెళుతుండగా జాతీయ రహదారిపై కొవ్వలి వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం నుంచి మహిళ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో గాయాలపాలైంది. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో వారిని ఆశ్రమ వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు.
యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన గోకవరపు కృష్ణ (32) అదృశ్యంపై అతని సోదరుడు నాగ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్‌రాజు తెలిపారు. కృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా శనివారం రాత్రి ఉట్టి వేడుక చూడడానికి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి ఇంటికి వెళ్లకపోవడంతో సోమవారం ఉదయం నుంచి గాలిస్తుండగా కృష్ణ బైక్, చెప్పులు చించినాడ వంతెనపై కనిపించాయి. దీంతో అతడి అన్న నాగ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి కృష్ణ కోసం గోదావరిలో గాలిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శాంసన్‌రాజు తెలిపారు.