
పశ్చిమాన అందాల కోన
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రకృతి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చెట్ల లేలేత పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు ఇక్కడ నిత్యం వసంతాన్ని తలపిస్తాయి. కొండ వాగుల నీటి ప్రవాహాలు, ప్రకృతి వడిలో జలపాతాల హోయలు ప్రకృతి ప్రేమికుల హృదయాల్లో చిరు సవ్వడి చేస్తాయి. బుట్టాయగూడెం మండంలోని పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి, గిన్నెపల్లి, గడ్డపల్లి, దారావాడ, చిలకలూరు మారుమూల అటవీ ప్రాంతంలో గల గ్రామాలు, ఆయా గ్రామాలకు వెళ్లే ప్రయాణంలో ప్రకృతి అందాలు ఎంతో కనువిందు చేస్తాయి. ప్రస్తుతం ఈ గ్రామాలకు సరైన రహదారి లేదు. ద్విచక్రవాహనాలు మాత్రం ప్రయాణించే సమయంలో రోడ్డుకు ఇరువైపులా పొడవైన పచ్చని చెట్లు, ఎత్తయిన కొండలు మైమరపింపజేస్తాయి. దట్టమైన అటవీప్రాంతంలో సెలయేర్లు, కనువిందుచేసే వాగులు, ఆహ్లాదాన్ని పంచే జలపాతాలు అణువణువు అందం తొణికిసలాడుతుంది. అలాగే గుబ్బల మంగమ్మ గుడి దర్శనం కూడా ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అరకు అందాలకు ఏ మాత్రం తీసిపోదు.