ప్రైవేట్ టీచర్లకు ప్రవేశాల భారం
భీమవరం: ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. యాజమాన్యాలు అడ్మిషన్ల టార్గెట్లు నిర్దేశించి క్యాంపెయినింగ్‌కు పంపడం, పిల్లలను చేర్పించేందుకు ఇంటింటా తిప్పడంపై టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండా ప్రవేశాలు నిషేధం. అయినా కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు వీటిని పట్టించుకోకుండా టీచర్లపై అదనపు భారం మోపుతున్నాయి.
తీవ్ర ఒత్తిళ్లు
వేసవి సెలవుల్లో కొత్త అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులకు టార్గెట్లు విధిస్తున్నారు. టార్గెట్లు పూర్తిచేయకుంటే ఉద్యోగం ఊడుతుందనే ఆందోళనలో మండుటెండల్లో ఊరూరా తిరుగుతూ పిల్లలను చేర్పించేందుకు టీచర్లు శ్రమిస్తున్నారు.
యాజమాన్యాల ఇష్టారాజ్యం
ప్రైవేట్ స్కూళ్లలో పనివేళలు నిర్ధిష్టంగా ఉండటం లేదు. కొన్ని విద్యాసంస్థల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉపాధ్యాయులతో పనిచేయిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అదనపు క్లాసులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనికితోడు ప్రవేశాల భారం మోపడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
563 స్కూళ్లు.. 1.35 లక్షల మంది విద్యార్థులు
జిల్లాలో సుమారు 563 ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఉండగా దాదాపు 1.35 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 16 వేల మంది టీచర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు. స్కూళ్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయని, దానికి తగ్గట్టు విద్యార్థుల సంఖ్య లేకుంటే జీతాలు చెల్లించడం కూడా కష్టమని చెప్పి సిబ్బందిని యాజమాన్యాలు బెదిరిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు.
తనిఖీలు నామమాత్రం
ప్రైవేట్ స్కూళ్లల్లో మౌలిక వసతులు, సిబ్బంది సమస్యలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నామమాత్రంగానే చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో వేసవి సెలవుల్లోనే 10వ తరగతి క్లాసులు నిర్వహిస్తున్నా, పబ్లిక్ గానే అడ్మిషన్లు చేస్తున్నా పట్టించుకునే అధికారులు లేరు. అధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారని, సమస్యలను తెలియజేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయనే భయంలో టీచర్లు ఉన్నారు. ఉన్నతాధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అడ్మిషన్లు విద్యాబోధన అడ్డుకుని సిబ్బందికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ఉపాధ్యాయులు కోరుతున్నారు.
అడ్మిషన్ల టార్గెట్లతో సతమతం
మండు వేసవిలో ఇంటింటా క్యాంపెయిన్
జిల్లాలో 563 ప్రైవేట్ విద్యాసంస్థలు
సుమారు 16 వేల మంది ఉపాధ్యాయులు


