మావుళ్లమ్మ మూల విరాట్ దర్శనం పునః ప్రారంభం
భీమవరం (ప్రకాశం చౌక్): మావుళ్లమ్మ వారి 62వ వార్షికోత్సవం సందర్భంగా అలంకరణ పనుల కోసం ఈ నెల 17న మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. అలంకరణ పనులు పూర్తి చేయడంతో సోమవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ కళాన్యాసం ప్రత్యేక పూజలను నిర్వహించగా అమ్మవారి మూల విరాట్ పునః దర్శనం భక్తులకు కల్పించారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలన్నారు.
భీమవరం: ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం చేయాలని అడిషనల్ ఎస్పీ వి.భీమారావు చెప్పారు, సోమవారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితులు తమ సమస్యలను వివరించారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): దివ్యాంగులకు ప్రతినెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రతి నెల మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యలను మూడో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్‌న్స్ డే రోజున అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులమీదుగా ఆవిష్కరించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి క్లినిక్‌లు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం రెవిన్యూ క్లినిక్‌లు ప్రారంభించి, పనితీరును పరిశీలించారు. కలెక్టరేట్‌లో 5 కౌంటర్లు ఏర్పాటు చేసి 59 అర్జీలు స్వీకరించారు.
భీమవరం: నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకలను సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
మావుళ్లమ్మ మూల విరాట్ దర్శనం పునః ప్రారంభం


