ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామివారి దర్శనం భక్తులకు కల్పించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆలయ పరిసరాలను, ఉత్తర ద్వారాన్ని సోమవారం రాత్రి పచ్చిపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో స్వామివారు ఆసీనులయ్యే ప్రాంతాన్ని అలంకరించి, ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. అర్ధరాత్రి వరకు ఈ పనులు సాగాయి. స్వామివారి వాహన సేవకు వెండి గరుడ, శేష వాహనాలను సిద్ధం చేశారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి నిజరూపంలో ఉన్న శ్రీవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
క్షేత్రానికి చేరుకున్న దీక్షాధారులు
తొలి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి గోవింద స్వాములు సోమవారం రాత్రి ఆలయానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం స్వామిని దర్శించిన తరువాత ఇరుముడులు సమర్పించనున్నారు.
రెండు వాహనాలపై..
ముక్కోటి పర్వదినాన స్వామివారు ఉత్తర ద్వారం వద్ద ఉదయం 10 గంటల వరకు వెండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత అదే వాహనంపై గ్రామోత్సవానికి వెళతారు. ఆ సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లు వెండి శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే సాయంత్రం వరకు స్వామివారు గర్భాలయంలో నిజరూప దర్శనంలో భక్తులను కటాక్షిస్తారు.
నేడు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామి దర్శనం
రెండు వాహనాలపై దర్శనమివ్వనున్న శ్రీవారు
ముందు రోజు రాత్రే వేలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు
ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం
ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం


