అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి అందిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులు వస్తే వాటిని తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు పంపించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 3, 4 తేదీలలో గోదావరి క్రీడోత్సవాల జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. డివిజనల్ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారు జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
సోమారామం ఈఓపై చర్యలు తీసుకోవాలి
దివ్యాంగురాలినని కూడా చూడకుండా క్యూలైన్‌లోంచి తనను పక్కకు నెట్టేసి అమర్యాదగా ప్రవర్తించిన భీమవరం పంచారామ ఆలయ ఈఓ రామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని మద్దింశెట్టి మాధవి లక్ష్మీ కుమారి రెండోసారి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేశారు. లక్ష్మీకుమారి కార్తీకమాసం చివరి సోమవారం స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న సమయంలో.. ఈఓ తన భుజంపై చెయ్యి వేసి పక్కకు లాగి రద్దీలో గుడికి రావడం అవసరమా అంటూ తనను చులకన చేసి మాట్లాడారని తెలిపారు.


