
పన్ను వేలం తగ్గింపుపై అభ్యంతరం
నరసాపురం: నరసాపురం మున్సిపల్ మార్కెట్‌లో రోజువారీ పన్ను వసూళ్లు (2025–26) హక్కులకు సంబంధించి బహిరంగ వేలం పాట అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వైఎస్సార్‌సీపీ మెజార్టీ కౌన్సిలర్లు తీసుకున్న ఈ నిర్ణయం కూటమి నేతలకు షాక్ ఇచ్చినట్టయ్యింది. గురువారం పన్ను పాట అంశం సింగిల్ అజెండాగా చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా వేలం విషయమై మున్సిపాలిటీ హైడ్రామా నడుస్తోంది. గతేడాది రూ.82 లక్షలకు పాట వెళ్లగా ఈ ఏడాది ఓ జనసేన నేతకు రూ.30 లక్షలకు పాటను ఖరారు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇబ్బందులొస్తాయని భావించి రూ.45 లక్షలకు ఓ టీడీపీ నేతకు కట్టబెట్టాలని అధికారులు తాపత్రయపడ్డారు. అయితే వీరి ప్రయత్నానికి కౌన్సిల్ అత్యవసర సమావేశంలో చుక్కెదురయ్యింది. మూడేళ్ల సగటును తీసుకుని రూ.70 లక్షలకు తగ్గకుండా పాట జరగాలని, మున్సిపల్ ఆదాయానికి గండి కొడతామంటే సహించేది లేదని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తేల్చిచెప్పింది.
వేలంలో స్పష్టత కరువు
మార్కెట్ పాట వ్యవహారంలో గందరగోళానికి అధికారుల వైఖరే కారణమని మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు, సీనియర్ వైఎస్సార్‌సీపీ నేత ఏడిద కోటసత్యనారాయణ (వైకేఎస్) ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాటకు సంబంధించి పలు అంశాల్లో స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం మున్సిపల్ సిబ్బందే పన్నులు వసూలు చేస్తున్నా.. సరైన రీతిలో జరగడం లేదన్నారు. మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ అధికారులు మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టాలని చూడటం దారుణమన్నారు. పదేళ్లలో ఎన్నడూలేని విధంగా పన్నుపాట ఎందుకు తగ్గిందని వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని ప్రశ్నిచారు. పాట తక్కువగా వెళ్లడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతుందని.. తీర్మానం చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ ప్రకటించారు. చర్చలో కోటిపల్లి సురేష్, వన్నెంరెడ్డి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, బొంతు రాజశేఖర్ పాల్గొన్నారు. మున్సిపాలిటీలో అధికారుల పనితీరు దారుణంగా ఉందని, గోదావరి పుష్కరాల నిర్వహణ విషయంలో, స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు విషయంలో అసలు కదిలిక లేదని పలువురు కౌన్సిలర్లు మండిపడ్డారు.
ప్రభుత్వానికి నివేదించాలని నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం
నరసాపురంలో కూటమి నేతలకు షాక్

పన్ను వేలం తగ్గింపుపై అభ్యంతరం