పెనుమంట్ర: రబీలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మిల్లింగ్‌లో గింజ విరిగిపోయి నూక ఎక్కువగా రావడం వల్ల కొనుగోలు ధర తగ్గిపోతుందని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ టి శ్రీనివాస్ అన్నారు. గురువారం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంటీయూ 1121 రకం పంటకాలం 125 రోజుల మాత్రమే అని, నిర్ణీత పంటకాలం పూర్తికాగానే పంటను కోయాలన్నారు. పూర్తిగా ఎండిపోయే వరకు చేనుపై ఉంచరాదన్నారు. ఈనెల 26 నుండి 29 వరకు గుంటూరు లాం ఫారంలో ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన జరుగుతుందని, దీనిలో దక్షిణ రాష్ట్రాల రైతులు పాల్గొంటరాని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ మొదటివారం నుంచి కోతలు మొదలు అవుతాయన్నారు. నూతన ఎన్‌ఎల్‌ఆర్ 3238 రకం ఆశాజనకంగా ఉందని, ఎటువంటి చీడపీడలు లేవని తెలిపారు. చిరుసంచి ప్రదర్శనలో ఉన్న ఎంటీయూ 1426 రకం గుణగణాలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి సాగులో ఉన్న వివిధ రకాల గుణగణాలు, ప్రత్యామ్నాయ రకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ కృష్ణాజీ, శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.