వరంగల్‌లో ఎందరికి చాన్స్‌! | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో ఎందరికి చాన్స్‌!

Nov 19 2026 1:13 AM | Updated on Nov 19 2026 1:13 AM

?

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పోలీసు శాఖలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్పీల పదోన్నతుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారుల్లో తొలివిడత కొందరికే అవకాశం దక్కనుండగా.. ఈ ప్రక్రియలో వరంగల్‌ రేంజ్‌కు ఎంతమేర ప్రాతినిథ్యం లభిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మొత్తం 101 మంది అధికారుల వివరాలను పరిశీలనకు తీసుకున్న నేపథ్యంలో మొదటగా 42 మందికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం పోలీసు వర్గాల్లో సాగుతోంది. వీరిలో 1991 బ్యాచ్‌కు చెందిన 18 మందికి, మిగిలిన వారికి 1995 బ్యాచ్‌ నుంచి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేస్తున్న, గతంలో పనిచేసిన అధికారుల్లో ఎందరికి పదోన్నతులు దక్కనున్నాయన్న చర్చ మొదలైంది.

హామీలు నెరవేర్చకపోతే మళ్లీ నిరాశే..

1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన డీఎస్పీల పదోన్నతుల వ్యవహారం చాలాకాలంగా సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి డీజీపీ సీవీ ఆనంద్‌ సెప్టెంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కోర్టు కేసులు కొనసాగితే అందరికీ నష్టం జరుగుతుందని, కేసులను ఉపసంహరించుకుంటే పదోన్నతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చినట్లు అప్పట్లో వెల్లడైంది. ముఖ్యంగా వరంగల్‌ జోన్‌కు చెందిన అధికారులు కేసుల ఉపసంహరణకు ముందుకొచ్చినట్లు అప్పట్లో సమాచారం వెలువడింది. అయితే ఇప్పుడు పదోన్నతుల ప్రక్రియలో తమకు ఆశించిన న్యాయం జరగడం లేదని 1991 బ్యాచ్‌ అధికారులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లుగా ఎదురుచూసి, న్యాయపోరాటం నుంచి వెనక్కి తగ్గిన తర్వాత కూడా పదోన్నతులు దక్కకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

వివరాలు కోరిన డీజీపీ కార్యాలయం..

ఈ నెల 17న డీజీపీ కార్యాలయం నుంచి అత్యవసర ఫ్యాక్స్‌ సందేశం జారీ అయింది. 101 మంది డీఎస్పీలకు సంబంధించి ఏసీబీ క్లియరెన్స్‌, పెండింగ్‌ క్రిమినల్‌ కేసులు, శాఖాపరమైన విచారణలు, అమలులో ఉన్న శిక్షల వివరాలను కోరారు. సంబంధిత వివరాలను ఈ నెల 19 (గురువారం) లోగా పంపాలని ఆదేశించారు. అయితే ఇందులో ఎస్సీ అధికారుల గ్రూప్‌, సబ్‌ క్లాసిఫికేషన్‌ వివరాలను కూడా కోరడం గమనార్హం. ఈ వివరాల పరిశీలన అనంతరం పదోన్నతుల ప్రక్రియలో తదుపరి అడుగులు పడనున్నట్లు తెలుస్తోంది.

వరంగల్‌ రేంజ్‌కు న్యాయం జరిగేదెప్పుడు?

ఉమ్మడి వరంగల్‌

నుంచి ఎందరికి

డీజీపీ కార్యాలయం నుంచి వివరాలు కోరిన 101 మంది జాబితాలో ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలో పనిచేస్తున్న పలువురు అధికారులు ఉన్నారు. ఏసీబీ, శాఖాపరమైన క్లియరెన్స్‌ కోసం వివరాలు కోరిన అధికారుల్లో ప్రస్తుతం మామునూరు ఏసీపీ ఎన్‌.వెంకటేశ్‌, కాజీపేట డీఎస్పీ టి.కృపాకర్‌, భూపాలపల్లి ఎస్‌డీపీఓ ఏ.సంపత్‌రావు, నర్సంపేట ఏసీపీ పి.రవీందర్‌రెడ్డి, వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఏ.మధుసూదన్‌, వరంగల్‌ పీటీసీ డీఎస్పీ కె.రమేశ్‌తో పాటు మరికొందరు ఉన్నారు. వీరిలో పదోన్నతికి అర్హత సాధించేవారెందరు? తొలివిడతలో అవకాశం దక్కించుకునేవారెందరు? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఏఎస్పీ పదోన్నతుల్లోనూ

రేంజ్‌కు అన్యాయమేనా?

డీజీపీ కార్యాలయానికి

101 మంది జాబితా..

మొదటగా 42 మందికి అవకాశం?

1991 బ్యాచ్‌లో 18 మందికే..

మిగిలినవి 1995వ బ్యాచ్‌కు?

అందులో ఉమ్మడి వరంగల్‌ నుంచి ఎందరికి అవకాశం?

కేసులు ఉపసంహరించుకోవాలన్న హామీతో ముందుకొచ్చిన అధికారులు

పదోన్నతుల జాబితాకెక్కని

1991 బ్యాచ్‌లో మళ్లీ అసంతృప్తి..

వరంగల్‌ రేంజ్‌ పరిధిలో గతంలో సీనియారిటీ, ఖాళీల సర్దుబాటుకు సంబంధించి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 1991 బ్యాచ్‌ అధికారుల సమస్యపై ప్రత్యేక కమిటీ కూడా పరిశీలన జరిపింది. ఈ నేపథ్యంలో తాజాగా చేపడుతున్న పదోన్నతుల్లో బ్యాచ్‌ల వారీగా, రేంజ్‌ల వారీగా ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నారు? ఉమ్మడి వరంగల్‌ అధికారుల్లో అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందా? కేసులు ఉపసంహరించుకున్న అధికారులకు ఇచ్చిన హామీ అమలవుతుందా? అన్న ప్రశ్నలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పదోన్నతుల జాబితాలో చోటు దక్కని 1991 బ్యాచ్‌ అధికారుల్లో మళ్లీ అసంతప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారైనా సీనియారిటీకి తగిన గుర్తింపు లభిస్తుందా? అన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement