● కొండా వర్గం మాజీ కార్పొరేటర్ల ప్రకటన
కాశిబుగ్గ: అభివృద్ధి కోసం ఆనాడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరామని, తాము మళ్లీ పార్టీ మారాల్సిన అవసరం లేదని కొండా వర్గం మాజీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ ఓ సిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్, సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలోని కొంతమంది మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొండా దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, ఎండీ పుర్ఖాన్, పల్లం పద్మ రవి, బైరబోయిన ఉమా, ఓని స్వర్ణ, యెలుగం సత్యనారాయణ పాల్గొన్నారు.
సమావేశానికి రాని కార్పొరేటర్లు ఎటువైపో?
కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ఆరుగురు కార్పొరేటర్లు బహిరంగంగా చెబుతున్నా.. విలేకరుల సమావేశానికి రాని కార్పొరేటర్లు ఎటు వెళ్తాన్నారనేది అనుమానాలకు తావిస్తోంది. తూర్పులో 24 మంది మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రె్స్ పార్టీ వైపు 18 మంది మాజీ కార్పొరేటర్లు ఉండగా, ఇందులో 16 మంది కొండా వర్గం కాగా, ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ సారయ్య వర్గంగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే నలుగురు బీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే బుధవారం నిర్వహించిన కొండా వర్గం కార్పొరేటర్లలో 6 మాత్రమే విలేకరుల సమావేశంలో పాల్గొనగా, మిగిలిన పది మంది మాజీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ఈ నెల 22న కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది.


