‘కుడా’ భవనం ఎవరికి? | - | Sakshi
Sakshi News home page

‘కుడా’ భవనం ఎవరికి?

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

‘కుడా’ భవనం ఎవరికి?

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

ప్రభుత్వ ఆస్తి.. కోట్ల రూపాయల విలువైన భవనం.. నగరంలో కీలకమైన ప్రైమ్‌ లొకేషన్‌! ఇంతటి విలువైన ఆస్తి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన భవనం ఎవరికి దక్కనుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాళోజీ కళాక్షేత్రానికి తరలించడంతో ఖాళీ అయిన ‘కుడా’ పాత భవనాన్ని అద్దెకు ఇచ్చేందుకు గతంలో ప్రకటన ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నా.. ప్రస్తుతం ఎవరికి కేటాయిస్తారనే విషయంలో స్పష్టత లేక వివాదాస్పదమవుతోంది. ఒకవైపు కమర్షియల్‌ టాక్స్‌ (కార్యాలయం అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతుండగా.. మరోవైపు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది.

అంచనాలే తిరకాసు..

ప్రస్తుతం కమర్షియల్‌ టాక్స్‌ శాఖ కార్యాలయం హంటర్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ భవనంలో కొనసాగుతోంది. దీనికి అద్దె రూపంలో రూ.లక్షల ప్రభుత్వ నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఇదే కార్యాలయాన్ని కుడా ఖాళీ చేసిన భవనంలోకి మారిస్తే.. ప్రైవేట్‌ వ్యక్తులకు వెళ్తున్న అద్దె ప్రభుత్వ ఖజానాకే చేరే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో కమర్షియల్‌ టాక్స్‌ శాఖ ఈభవనంపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే కుడా చెబుతున్న అద్దె రేటుకు, ప్రభుత్వ శాఖల అద్దె ప్రమాణాలకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. దీంతో చదరపు అడుగు అద్దె ఎంత ఉండాలనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. భవనానికి సరైన అద్దె ఎంత నిర్ణయించాలనే అంశంపై ఆర్‌అండ్‌బీ అధికారులతో అంచనాలు వేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆశాఖ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చదరపు అడుగు అద్దెను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో కమర్షియల్‌ టాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రెండు శాఖల మధ్య అద్దె ఒప్పందం కుదిరితే ప్రస్తుతం ప్రైవేట్‌ భవనానికి వెళ్తున్న అద్దె ప్రభుత్వానికే మిగిలే అవకాశముంది.

ప్రభుత్వ ఆదాయానికి మార్గమా.. ప్రైవేట్‌ ప్రయోజనాలకా?

ఖాళీ చేసిన ‘కుడా’ కార్యాలయంపై సర్వత్రా సస్పెన్స్‌

అద్దెకు ఇచ్చేందుకు గతంలోనే

ప్రకటన.. తెరపైకి కమర్షియల్‌

టాక్స్‌ శాఖ

చదరపు అడుగు అద్దైపె ఆర్‌అండ్‌బీ అధికారులతో అంచనాలు

తెరవెనుక మరో ప్రయత్నమంటూ ప్రచారం!

ఉన్నతాధికారులు స్పష్టత ఇస్తేనే ఊహాగానాలు, ప్రచారాలకు తెర

తెరవెనుక రాజకీయ కోణం!

కుడా భవనంపై మరో కోణంలోనూ చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న కొందరు పెద్దలే.. వాటిని తమకు అనుకూలమైన వారికి అప్పగించే ప్రయత్నాలకు అండగా నిలుస్తున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కొందరు నేతల వారసులకు ప్రయోజనం చేకూర్చేలా, ఓ వైద్యుడికి కుడా భవనాన్ని అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారా యి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రైమ్‌ ల్యాండ్‌పై కన్నేసి.. తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. గతంలో ఆర్టీసీ ఆస్తుల విషయంలో చోటుచేసుకున్న పరిణా మాలను గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు కుడా భవనం, స్థలం విషయంలోనూ అలాంటి వ్యవహారానికి తెరలేపుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్ర భుత్వ శాఖకే భవనం కేటాయించి ఆదాయం పెంచుతారా? లేక ప్రైవేట్‌ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారా? అన్న చర్చకు సంబంధిత అ ధికారులు స్పందించి వాస్తవాలు వెల్లడిస్తేనే అ నుమానాలకు, ఊహాగానాలకు తెరపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement