మామునూరు: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని వరంగల్ సీపీ శ్వేత ఆదేశించారు. మామునూరు పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల ద ర్యాప్తు పురోగతిని పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల తీరును సమీక్షించారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ పిలుపునిచ్చారు. తనిఖీల్లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ ఆర్.సంతోశ్‌కుమార్, మామునూరు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రేశ్వరస్వామికి పుష్పార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు మణికంఠశర్మ, అర్చకుడు దత్తకుమార్‌శర్మ ఉదయం ప్రభాతసేవ, మూలగణపతికి అభిషేకం, పూజలు, శ్రీరుద్రేశ్వరుడికి 11 లీటర్ల మధువు (తేనె)తో అభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ కరుణాకర్, దీప్తి దంపతుల సౌజన్యంతో స్వామివారికి రుద్రనామాలతో పుష్పాభిషేకం నిర్వహించి సిరా నైవేద్యం నివేదన చేసి ఢమరుక శంకునాదాలతో ద్వాదశ హారతి జరిపారు. ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులకు కార్తీక సమారాధన (వనభోజనాలు) నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త వంగాల సోమయాజులు కార్తీకపురాణ ప్రవచనం చేశారు, సాయంత్రం మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.
కాశిబుగ్గ: కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నెఫ్రాలజీ కోర్సును వైద్య విద్యార్థులు పూర్తి చేశారు. సూపర్‌లో మొదటి సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసిన వైద్య విద్యార్థులు కృష్ణ చైతన్య, సాయి వెంకట్, వైష్ణవి, ఇషాక్ అమితేష్ గౌడ్ తొలి బ్యాచ్‌గా నిలిచారు. కాగా, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో 2022లో నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు మంజూరైంది. దీంతో ఆ విభాగానికి మంజూరైన ఐదు సీట్లకు 2023లో ఐదుగురు విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరు మూడేళ్ల పాటు కోర్సు పూర్తి చేసుకుని పరీక్షలు రాసి ఇంటిముఖం పట్టారు. ఈ విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ తొలి బ్యాచ్‌గా పూర్తి చేయడం సంతోషంగా ఉందని తోటి వైద్య విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
నిర్మానుష్యంగా వరంగల్ ఆర్‌ఓ
కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది మంగళవారం సాముహిక సెలవులో వెళ్లడంతో వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్‌తో ఉద్యోగులు సాముహిక సెలవు ప్రకటించడంతో మంగళవారం ఒక్క ఉద్యోగి కూడా అందుబాటులో లేకపోవడంతో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. మరో వైపు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.
ఇంటర్ వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌కు అనూష
కేయూ క్యాంపస్ : ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు చైన్నెలోని వినాయ మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ నిర్వహించనన్నారు. దీనికి కేయూ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు తరఫున ఖమ్మంలోని కవితా మెమోరియల్ డిగ్రీకళాశాల విద్యార్థిని ఎం. అనూష పాల్గొననున్నారు.


