వరుణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి | - | Sakshi
Sakshi News home page

వరుణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

వరుణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

జడ్చర్ల: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన చోరీ కేసు నిందితుడు హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన వరుణ్‌ మృతదేహానికి మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ ముదాసర్‌ సమక్షంలో ముగ్గురు డాక్టర్ల బృందం పోస్టుమార్టం ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేసింది. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో తీవ్ర అస్వస్థతకు గురైన వరుణ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు పేర్కొంటున్న నేపథ్యంలో మృతుడి తల్లి అరుణ, తదితర కుటుంబీకులు సోమవారం జడ్చర్ల పీఎస్‌కు చేరుకుని తమ కుమారుడి మృతికి కారణమైన ఎస్సై జయప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నారని మృతుడి తల్లి, ఇతర కుటుంబీకులు పోస్టుమార్టానికి సహకరించలేదు. ఈ క్రమంలో మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించడంతో మంగళవారం రాత్రి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి సమక్షంలో డాక్టర్ల బృందం దాదాపు రెండు గంటలపాటు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు.

హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..

వరుణ్‌ మృతికి సంబంధించి స్థానిక పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు మృతుడి సోదరుడు అరుణ్‌ తెలిపారు. తన ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్సీ.. జిల్లా ఎస్పీ, తదితరులకు నోటీసులు జారీ చేసిందన్నారు. తమ సోదరుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

విచారణాధికారిగా వనపర్తి డీఎస్పీ..

పోలీస్‌స్టేషన్‌లో వరుణ్‌ మృతి ఘటనకు సంబంధించి వనపర్తి డీఎస్పీ గిరిబాబును విచారణాధికారిగా నియమించినట్లు మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుమార్టం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా సీఐ కమలాకర్‌, ఎస్సై మల్లేశ్‌, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి సమక్షంలో ప్రక్రియ

వరుణ్‌ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement