కలెక్టరేట్‌లో బాలల ప్రజావాణికి వినతుల వెల్లువ
ఈ చిత్రంలో కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్నది హనుమకొండలోని లష్కర్‌బజార్ బాలికల ఉన్న త పాఠశాల విద్యార్థులు. రోజూ ఉదయం అల్పాహారం ఆలస్యంగా వస్తోందని, అందరూ అల్పాహారం చేసిన తర్వాతే తరగతులు ప్రారంభమయ్యేలా టైంటేబుల్ మార్చాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పాఠశాల ప్రారంభానికి ముందే అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ, పాఠశాల హెచ్‌ఎంను ఆదేశించారు.
ఈఫొటోలో కలెక్టర్‌తో మాట్లాడుతున్నది కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. తమ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, భవనం ఎప్పుడు కూలుతుందో తెలియక భయంతో పాఠాలు వింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా సమకూరిన ఆర్‌ఓ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలని డీఈఓకు సూచించారు.
● పాఠశాలల్లో సమస్యలు విన్నవించిన విద్యార్థులు
● సమస్యలు పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ
● అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్‌లో మహిళా, శిశు, పిల్లల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బాలల గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరై వివిధ పాఠశాలల విద్యార్థుల నుంచి వినతులు స్వీకరించారు. బాలల ప్రజావాణికి మొత్తం 51 వినతులు అందాయి. పాఠశాల భవనాల మరమ్మతులు, అల్పాహారం సమస్యలు, పాఠశాలల సమీపంలోన్‌షాపులు, మద్యం దుకాణాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, పాఠశాల సమయాలు, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
చిన్నారులతో చిన్నారిలా..
విద్యార్థులు తమ సమస్యలు వివరించే సమయంలో కలెక్టర్ వారితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. చిన్నారుల వయసుకు తగ్గట్టుగా వారిలాగే హావభావాలు వ్యక్తం చేస్తూ, సరదాగా ప్రశ్నలు వేస్తూ మాట్లాడారు. కలెక్టర్ తమతో స్నేహపూర్వకంగా మాట్లాడడంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా తమ సమస్యలు వివరించారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది హనుమకొండలోని మర్కజీ పాఠశాలకు చెందిన 7 నుంచి 10వ తరగతి విద్యార్థులు. పాఠశాల పరిసరాల్లో మద్యం దుకాణాలు ఉన్నాయని, పాఠశాలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మద్యం, సిగరెట్లు తాగుతూ గుమిగూడి ఉంటున్నారని, భయమవుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో 13 సెక్షన్లు ఉండగా.. ఒక్క హిందీ ఉపాధ్యాయుడే ఉన్నారని, అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారులు కాజీపేట మండలం మడికొండలోని ఎంఎన్‌నగర్‌కు చెందినవారు. సుమారు 34 మంది డాన్ బాస్కో స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువుకొనసాగిస్తున్నారు. వీరికి ఇప్పటివరకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. ఆధార్ కార్డులు లేవు. దీంతో తమను స్కూళ్లలో చేర్చుకోవట్లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ విద్యార్థులెవరూ చదువు ఆపొద్దని, ఆధార్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


