సీఎంఆర్‌పై ఎందుకీ వివక్ష? | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌పై ఎందుకీ వివక్ష?

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ధాన్యం కొరత వ్యవహారంలో మిల్లర్లపై చర్యల విషయంలో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్‌ తనిఖీల్లో భారీగా ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు బయటపడినా.. సంబంధిత మిల్లర్ల నుంచి కొరతను పూర్తిస్థాయిలో రాబట్టడంలో ఎందుకు ఉదాసీనత ప్రదర్శించారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించినా.. మరోవైపు చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. మిల్లర్లకు నోటీసులు, కేసుల నమోదు, ధాన్యం రికవరీ విషయంలో అనుసరించిన విధానంపై కొందరు సివిల్‌ సప్లయీస్‌ అధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఆగస్టులో గుర్తింపు..

జనగామ జిల్లాలోని పాలకుర్తి, లింగాలఘణపురం, నర్మెట మండలాల పరిధిలోని నాలుగు రైస్‌ మిల్లుల్లో ఆగస్టులో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఆర్‌ ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం. సంబంధిత మిల్లులపై కేసులు నమోదు చేయాలని శాఖాపరంగా ఆదేశాలు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో అమలు ఆశించిన స్థాయిలో జరగలేదనే ఆరోపణలున్నాయి. పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? ఆగస్టులో గుర్తించిన కొరతపై చర్యలు ఎందుకు పూర్తికాలేదు? అనే అంశాలను విజిలెన్స్‌ అధికారులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

అన్ని కోణాల్లో విచారణ..?

ఈ వ్యవహారంలో జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ), సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ (డీఎం), డీటీలు, క్షేత్రస్థాయి సిబ్బంది పాత్రపైనా విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మిల్లుల యాజమాన్యాలు, లీజు వివరాలు, ఇతర జిల్లాల్లో ఉన్న బకాయిలు, మిల్లుల నిర్వహణలో అసలు బాధ్యులెవరనే అంశాలు పరిశీలించనున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ పరిధిలో సుమారు రూ.96 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం కొరత, మిల్లర్ల బకాయిలు, చర్యల అమలుపై జిల్లాల వారీ గా వివరాలు సేకరించేందుకు విజిలెన్స్‌ అధికారులు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నేడోరేపో డీఎస్‌ఓ, డీఎం, డీటీలు, సంబంధిత అధికారుల్ని విచారించే అవకాశముంది.

మిల్లర్ల నుంచి రాబట్టడంలో ఎందుకీ నిర్లక్ష్యం?

ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్‌ బియ్యం లేదా ధాన్యం నిల్వల్లో కొరత గుర్తించినప్పుడు బాధ్యులైన మిల్లర్ల నుంచి రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే కొరతను భర్తీ చేస్తామంటూ మిల్లర్లు చెబుతున్న హామీలతోనే అధికారులు కాలయాపన చేస్తున్నారా? ప్రభుత్వ ధాన్యం గల్లంతైన వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సిన చోట ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారు? అనే కోణంలో విచారణ సాగనున్నట్లు సమాచారం. మిల్లర్ల నుంచి బకాయిలు రాబట్టేందుకు తీసుకున్న చర్యలు, జారీ చేసిన నోటీసులు, రికవరీ పురోగతిపై వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది. కాగా, మిల్లుల్లో ధాన్యం నిల్వలను గతంలో ప్రతి వారం, పది లేదా పదిహేను రోజులకు ఒకసారి తనిఖీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాంటప్పుడు నూకలు, తాలు, ఇతర తరుగు వివరాలను ఎప్పటికప్పుడు ఎందుకు నమోదు చేయలేదు? ప్రస్తుతం కొరత బయటపడిన తర్వాతే తరుగు పేరుతో వివరణలు ఇస్తున్నారా? అప్పటి తనిఖీలు నామమాత్రంగా జరిగాయా? అనే అంశాలపై కూడా ఆరా తీయనున్నట్లు సమాచారం. తనిఖీ రికార్డులు, స్టాక్‌ రిజిస్టర్లు, ధాన్యం రాకపోకల వివరాలను సరిపోల్చి బాధ్యతలను నిర్ధారించే అవకాశం ఉంది.

సివిల్‌ సప్లయీస్‌ అధికారులను ప్రశ్నించనున్న ‘విజిలెన్స్‌’

ఉమ్మడి వరంగల్‌లో కొందరిపై గురి.. డీఎస్‌ఓ, డీఎం, డీటీల వరకు విచారణ

జిల్లాల వారీగా విచారణకు రంగంలోకి ‘విజిలెన్స్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement