ఎల్కతుర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని ఓ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ ధనసరి సీతక్కతో కలిసి లబ్ధిదారులకు నూతన పెన్షన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వృత్తుల వారికి ఉచితంగా ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం ప్రారంభించనుందని తెలిపారు. గతంలో రైతులకే పరిమితమైన బీమాను రాష్ట్రంలోని అన్ని వృత్తుల వారికి వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అప్పుల భారంలో ఉనాన్నా పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్తవి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండలంలో 5,850మందికి పెన్షన్లు ఇస్తుండగా తాజాగా 715మందికి కొత్తవి మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,63,857మందికి పెన్షన్లు మంజూరైట్లు వెల్లడించారు.
మహిళా సంఘాలకు రూ.75వేల
కోట్లు మంజూరు..
మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్షకోట్ల వడ్డీలేని రుణాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు రూ.75వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మహిళా, శిశు సంక్షేమ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గీత, నేత కార్మికులు, దివ్యాంగులు, తసేమియా బాధితులైన పురుష పెన్షన్ దారులు మరణిస్తే వారి భార్యలకు ఒకటి, రెండు నెలల్లోనే పెన్షన్ మంజూరయ్యేలా కొత్త జీఓ తీసుకొచ్చిట్లు పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కిరాణం, బట్టల దుకాణాలు, మొబైల్, వెహికల్స్ షాపుల ఏర్పాటుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరలో రూ.3 కోట్ల రుణాలతో వ్యాపారాలు నిర్వహించిన మహిళలు రూ. 6కోట్ల వరకు ఆదాయం అర్జించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,800కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు. ఈనెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నలు వెల్లడించారు. ఆర్డీఓ వెంకట్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శేషాద్రి, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీడీఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్


