● సమస్యల వలయంలో గ్రంథాలయాలు
● సొంత భవనాలు, వసతులు కరువు
● ఇబ్బందులు పడుతున్న పాఠకులు
●నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
కాశిబుగ్గ: జిల్లాలోని గ్రంథాలయాలు నిధుల్లేక నీరసించిపోతున్నాయి. సరైన వసతులు లేకపోవడంతో లైబ్రరీల నిర్వహణ భారమై పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, అద్దె భవనాల్లోని గ్రంథాలయాలు మరీ అధ్వానంగా మారుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రంథపాలకుల కొరత వేధిస్తోంది. చాలా ప్రాంతాల్లో ప్రైవేట్ సహాయకులతోనే గ్రంథాలయాలను నెట్టుకొస్తున్నారు. నేటి (శనివారం) నుంచి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..
జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి శాఖ గ్రంథాలయాల వరకు సమస్యలతో సతమతమవుతున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. ఇక్కడ ప్రత్యేకంగా పాఠకులకు రీడింగ్ రూం, సెక్రటరీకి చాంబర్ లేదు. జిల్లాలోని గ్రంథాలయాల్లో 20 మంది సిబ్బందికి ముగ్గురు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలోని 12 శాఖ గ్రఽంథాలయాలు, 4 గ్రామ గ్రఽంథాలయాల్లో అరకొర వసతులతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇన్‌చార్జ్‌ల పాలన..
వరంగల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని లైబ్రేరియన్ మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. అలాగే, ప్రాంతీయ గ్రంథాలయంలో పనిచేస్తున్న గెజిటెడ్ లైబ్రేరియన్ వరంగల్ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట లైబ్రేరియన్ రాయపర్తి, వర్ధన్నపేట ఇన్‌చార్జ్‌గా, గీసుకొండ లైబ్రేరియన్ వరంగల్ జిల్లా కేంద్ర గ్రంథాలయ ఇన్‌చార్జ్‌గా, పర్వతగిరి లైబ్రేరియన్ నెక్కొండ, సంగెం మండలాల గ్రంథాలయాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
పోటీ పరీక్షల పుస్తకాల కొరత..
రాయపర్తి, వర్ధన్నపేట, నెక్కొండ, నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, ఉర్సు గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నా వసతులు కరవయ్యాయి. ముఖ్యంగా రాయపర్తి, వర్ధన్నపేట గ్రంథాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేవు.
అద్దె భవనాలతో ఇబ్బందులు..
గీసుకొండ, సంగెం మండలాల్లోని గ్రఽంథాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గురిజాల, రంగశాయిపేట, కరీమాబాద్, చెన్నారావుపేట, దుగ్గొండి, పర్వతగిరి గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. కానీ, వసతులు లేక పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంతభవనాల నిర్మాణం, వసతుల కల్పనకు నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇన్‌చార్జ్ లైబ్రేరియన్లు లేనప్పుడు స్వీపర్లే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు లైబ్రరీలకు సొంత భవనాలు నిర్మించి, సదుపాయాలు కల్పించాలి.
సంగెం: ఈ ఫొటోలో కనిపిస్తున్నది సంగెం మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం. నిజాం కాలంనాటి పాతభవనంలో ఉన్న గ్రంథాలయ స్థలంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. అప్పటి నుంచి నుంచి గ్రంథాలయం అద్దె భవనంలోని ఇరుకు గదిలో కొనసాగుతోంది. దీంతో గ్రంథాలయం వైపు నిరుద్యోగ యువత, విద్యార్థులు వెళ్లడం మానేశారు. దీనికి తోడు రెగ్యులర్ గ్రంథపాలకుడు లేడు. ఇన్‌చార్జ్ వారానికి మూడు రోజులు మాత్రమే వస్తూ పోతుండడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఇలా ఈ గ్రంథాలయమే కాదు.. జిల్లాలోని అనేక గ్రంథాలయాల పరిస్థితి ఈవిధంగానే ఉంది.


