ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను శుక్రవారం అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తెలంగాణ పివిన్ కుమార్ సందర్శించారు. మధ్యకోటలోని శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఖుష్‌మహల్,రాతి, మట్టికోట, ఏకశిలగుట్ట అందాలు తిలకించారు. కోట విశిష్టతను గైడ్ రవియాదవ్ వివరించారు. ఆయనవెంట వరంగల్ రీజినల్ పీఎఫ్ కమిషనర్ వైడీ శ్రీనివాస్, వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ సూర్య ప్రకాశ్, కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్‌చార్జ్ అజయ్ ఉన్నారు.
నూతన సాఫ్ట్‌వేర్‌తో 25న
పునఃప్రారంభం
ఖిలా వరంగల్: వరంగల్ సబ్‌డివిజన్ పరిధిలోని తపాలా జీవిత బీమా (పీఎల్‌ఐ), గ్రామీణ తపాల జీవిత బీమా (ఆర్‌పీఎల్‌ఐ) సేవలు ఈ నెల16 నుంచి 24వ తేదీ వరకు డివిజన్ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాలలో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ (ఐఎంఎస్) సాఫ్ట్‌వేర్ ద్వారా 25వతేదీ నుంచి నూతన సేవలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని కోరారు.
హన్మకొండ: వరంగల్ డీసీసీబీలో నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జరిగిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు నాబార్డు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీనిపై సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించగా.. జాయింట్ రిజిస్ట్రార్ సురేఖ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ఈక్రమంలో శుక్రవారం కూడా విచారణ జరిగింది. గత పాలక మండలి సభ్యులను విచారణకు రావాలని కోరగా.. తమకు వీలు కావట్లేదని మరింత సమయాన్ని కోరినట్లు తెలిసింది. అదేవిధంగా.. శనివారం నిధుల వినియోగంతో సంబంధం ఉన్న విభాగాలకు చెందిన జీఎం, డీజీఎం, ఏజీఎంలను విచారణకు రావాలని విచారణ అధికారులు కోరినట్లు సమాచారం.
హసన్‌పర్తి: డిప్యూటీ ఎడ్యుకేషన్ పరీక్షలు శుక్రవారం నిర్వహించగా.. మహిళా అభ్యర్థులకు విధించి ఆభరణాల ఆంక్షలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సమీపంలోని ఆయాన్ డిజిటల్ జోన్ ఆన్‌లైన్ సెంటర్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థులకు ఆభరణాల నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ముందు మెడలోని చైన్, చెవుల కమ్మలు తదితర ఆభరణాలు తొలగించాలని నిర్వాహకులు సూచించారు. అయితే పరీక్షకు కుటుంబ సభ్యులు, సహాయకులతో కలిసి వచ్చిన మహిళలు తమ ఆభరణాల్ని వారి వద్ద భద్రపర్చారు. ఒంటరిగా వచ్చిన అభ్యర్థులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. ఆభరణాలు ఎక్కడ భద్రపర్చాలో తెలియక ఆందోళనకు గురయ్యారు.
నయీంనగర్: కుడా (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కార్యాలయం ఇక నుంచి కాళోజీ కళాక్షేత్రం నుంచి సేవలందించనుంది. శుక్రవారం సిబ్బంది కుడా కార్యాలయాన్ని తరలించారు. రెండు రోజుల్లో పూర్తిగా సామగ్రి తరలించనున్నారు. కాళోజీ కళాక్షేత్రంలో ఖాళీగా ఉన్న పైఅంతస్తులో ఈకార్యాలయం ఏర్పాటు కానుంది. ప్రైం హై కమర్షియల్ ఏరియాలో ఇప్పటివరకు ఉన్న కుడా కార్యాలయాన్ని కిరాయికి ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటనలు ఇవ్వడంతో పలు ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ఆసక్తి కనబర్చాయి. ఎవరికి ఇవ్వాలో కుడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


