నల్లబెల్లి: అంగన్‌వాడీ కేంద్రాలను కార్పొరేట్ ప్లేస్కూళ్లకు దీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా గోడలపై ఆకర్షణీయమైన రంగులు, కార్టూన్లు, అక్షరాలు, అంకెలు, ప్రకృతి చిత్రాలతో బాల పెయింటింగ్స్, ఆధునికీకరణ పనులు ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. గోడలపై ఉన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రాథమిక భావాలను పిల్లలు సులభంగా నేర్చుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులకు శుద్ధిచేసిన నీటిని అందించేందుకు ఆర్‌ఓ ప్లాంట్లు పంపిణీకి శ్రీకారం చుట్టింది. కానీ, అభివృద్ధి చేసిన అంగన్‌వాడీ కేంద్రాలనే మళ్లీ అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ ప్రాజెక్టు పరిధిలో 919 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. బాల పెయింటింగ్, ఆర్‌ఓ ప్లాంట్లు పంపిణీ చేసేందుకు వీటిలో 90 అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఇందుకోసం ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.25 వేల చొప్పున రూ.22.50 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నుంచి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఈడబ్ల్యూయూడీసీ) ఖాతాకు బదిలీ చేసినట్లు సమాచారం. టెండర్లు లేదా నామినేషన్ ప్రక్రియ ద్వారా పనులు కేటాయించి అధికారిక వర్క్ ఆర్డర్ల జారీ చేయాల్సి ఉంది. కానీ, వర్క్ ఆర్డర్ ఉత్తర్వులు లేకుండానే పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల కేటాయింపు, పనుల నిర్వహణ, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకతపై సందేహాలు వస్తున్నాయి.
ఎంపిక చేసినవే రెండోసారి ఎంపిక
నల్లబెల్లి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల ఎంపికలోనూ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. మండలంలోని గొల్లపల్లి–1, నల్లబెల్లి–3 అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ ఎంపికను పరిశీలిస్తే అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం నల్లబెల్లి అంగన్‌వాడీ కేంద్రం–3 భవనానికి రంగులు వేశారు. ఈ ఏడాది మళ్లీ అదే కేంద్రాన్ని ఎంపిక చేసి పెయింటింగ్ వేశారు. ఇదేవిధంగా జిల్లాలోని పలు కేంద్రాలను కూడా ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన బాల పెయిటింగ్ పనులు చేయాలని, సకాలంలో ఆర్వో ప్లాంట్లు పంపిణీ చేయాలని, అవసరమైన కేంద్రాలను ఎంపిక చేసి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తాం..
నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల పెయింటింగ్ పనులు చేపడతాం. గతంలోనే పెయింటింగ్ పూర్తయిన కేంద్రాలు తిరిగి ఎంపికై నట్లు గుర్తిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అటువంటి కేంద్రాల స్థానంలో ఇతర అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసి పనులు చేపడతాం. నిధుల వినియోగం, పనుల కేటాయింపులో పారదర్శకత పాటిస్తూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన ప్రీప్రైమరీ విద్యా వాతవరణం కల్పిస్తాం. బాల పెయింటింగ్ పనులు పూర్తి కాగానే ఎంపికై న అంగన్‌వాడీ కేంద్రాలకు ఆర్వో ప్లాంట్లను సరఫరా చేస్తాం.
– అరుణ్‌కుమార్, ఈడబ్ల్యూయూడీసీ ఈఈ, వరంగల్
అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిలో నిబంధనలకు నీళ్లు
గతంలో రంగులు (బాల పెయింటింగ్) వేసిన సెంటర్లు మళ్లీ ఎంపిక
రూ.22.50 లక్షల నిధుల వినియోగంపై అనుమానాలు


