వరంగల్ అర్బన్: వరంగల్ పోతన రోడ్డు–హంటర్ రోడ్డులో పలు ప్రాంతాల కాలనీలకు తాగునీటి సరఫరా చేసే నాలుగు చోట్ల పైప్‌లైన్ వాల్వ్ లీకేజీగా మారింది. బుధవారం మధ్యాహ్నం నాలుగు ప్రాంతాల్లో వాల్వ్‌లు లీక్‌గా మారాయి. నీరుపైకి ఎగిసిపడి పక్కన ఉన్న నాలాల్లోకి చేరింది. రెండున్నర గంటలకుపైగా తాగునీరు (దాదాపు రెండు గ్యాలన్ల నీరు) వృథాగా పోయింది. లైన్‌మెన్‌కు, ఏఈకి సమాచారం అందించడంతో నీటి పంపింగ్ నిలిపేశారు. ఇలా.. నగరంలో వందల సంఖ్యలో రోజూ పైప్‌లైన్ల వాల్వ్‌లు, పైపులైన్లు లీకవుతున్నాయి. కొన్ని అధికారుల దృష్టికి వస్తున్నాయి. చాలా వరకు రావడం లేదు.
తీరు మార్చుకోని ఇంజనీర్లు
ఎలినినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోగా.. రిజర్వాయర్లలోని నీరు సామర్థ్యం మేరకు లేదు. మరో 5 నెలలు పాటు మాత్రమే మహా నగరానికి సరిపడా నీరు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిల్వ ఉంది. నీళ్లను పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈనేపథ్యంలో.. బల్దియాకు చెందిన లైన్‌మెన్, వర్క్ ఇన్‌స్పెక్టర్, ఏఈలు, డీఈలు, ఈఈల వరకు నీటి వృథా చేస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని ఆయా కాలనీల వాసులను హెచ్చరించారు. దీంతో కొంత మేరకు నీటి వృథాపై ప్రజలు దృష్టి కేంద్రీకరించారు. కానీ, బల్దియా ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల పైప్‌లైన్లు, వాల్వ్ లు లీకేజీలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. 70 శాతం కాలనీలకు రోజూ నీటి సరఫరా, 20 శాతం కాలనీలకు రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాను 2 గంటల నుంచి గంటకు తగ్గించారు. కానీ, వాల్వ్‌ల దగ్గర లీకేజీలను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో అమూల్యమైన తాగునీరంతా రోడ్లు, డ్రెయినేజీ పాలవుతోంది. నిత్యం సుమారు 30 కాలనీలకు సరిపడా తాగునీరు వృథాగా పోతోదని ఇంజనీర్లే చెబుతుండడం గమనార్హం.
మరమ్మతులు కరువు..
తాగునీటి సరఫరా చేసేందుకు పైపులైన్ల మధ్య కంట్రోల్ వాల్వ్‌లను ఏర్పాటు చేస్తారు. ఏ సమయంలో నీటిని వదలాలో వీటి ద్వారా చేస్తుండడంతో వాల్వ్‌లు తరుచూ పాడైపోతుంటాయి. ఈ వాల్వ్‌లు పాతబడడం, ఇనుము రాడ్స్ అరిగిపోవడం, తుప్పుపట్టి ఈ సమస్యలు ఆధికమవుతున్నాయి. లీకేజీల కోసం బల్దియా ఏటా రూ.2.50 కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ నీటి వృథాను అరికట్టడంలో విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి.
నగరంలో నిత్యకృత్యంగా
పైపులైన్ లీకేజీలు
నిత్యం 30 కాలనీలకు
సరిపోయే నీరు డ్రెయినేజీలోకి..
నీరు వృథా చేసేవారికి రూ.5 వేలు జరిమానా విధించాలి: బల్దియా
ఈ లెక్కన ఇంజనీర్లకెంత జరిమానా విధిస్తారు?: గ్రేటర్ ప్రజలు
బుధవారం పోతననగర్‌లో రెండున్నర గంటలు నాలాలోకి శుద్ధి నీరు
క్షేత్రస్థాయిలో..
నగరంలో పైపులైన్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయి. దాదాపు 30 కాలనీలకు సరిపడా నీరు నిత్యం డ్రెయినేజీల్లోకి వెళ్తోంది. ఎల్‌నినో ఎఫెక్ట్ అని నీటి సరఫరా రెండు గంటల నుంచి గంటకు తగ్గించారు. చాలా కాలనీలకు నీటినే వదలడం లేదన్న ఆరోపణలున్నాయి. లీకేజీల కారణంగా డ్రెయినేజీల్లో కలుస్తున్న నీటి వృథాకు బాధ్యులెవరు? ఇంజనీర్లకు ఎన్ని లక్షల పెనాల్టీ విధిస్తారు? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
సమీక్ష సమావేశాల్లో..
‘ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రతీ నీటి బొట్టును అవసరం మేరకే వాడాలి. నీటిని వృథా చేసే నగరవాసులకు రూ.5 వేలు జరిమానా విధిస్తాం’ అని బల్దియా అధికారులు ఇటీవల నిర్ణయించారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.


