సాక్షి, వరంగల్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు పట్టభద్రుల నుంచి భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. కానీ, వాటి పరిశీలన, ఆమోద ప్రక్రియ మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఇప్పటివరకు 56,407 దరఖాస్తులు (56,367 ఆన్‌లైన్, 40 ఆఫ్‌లైన్) అందగా.. వీటిలో 10,956 మాత్రమే ఆమోదం పొందాయి. మరో 553 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 44,898 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. బుధవారం నాటికి గణాంకాలు పరిశీలిస్తే దరఖాస్తుల స్వీకరణకు, పరిష్కారానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి. దీంతో రోజురోజుకు వందలాది దరఖాస్తులు అధికారులకు ఆన్‌లైన్‌లో అందుతున్న సంగతి తెలిసిందే.
వివిధ దశల్లో 44 వేలకుపైగా...
మొత్తం పెండింగ్ దరఖాస్తుల్లో 6,133 ఇంకా అన్ ప్రాసెస్డ్ (ఇంకా ప్రాసెస్ చేయని) దశలో ఉన్నాయి. 36,778 దరఖాస్తులు బ్లాక్ అసైన్‌మెంట్ కేటగిరీలో, 1,027 ఏఈఆర్‌ఓ స్థాయిలో, 960 ఈఆర్‌ఓ స్థాయిలో ఉన్నట్లు డ్యాష్‌బోర్డులో నమోదైంది. దీంతో దరఖాస్తుల పరిశీలనను అధికారులు వేగవంతం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా అత్యధిక దరఖాస్తులు వచ్చిన వరంగల్, ఖిలా వరంగల్ మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. అర్హులైన పట్టభద్రుల దరఖాస్తులను సకాలంలో పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పట్టభద్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీ నేతలు కోరుతున్నారు. వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపడితే ప్రక్రియ వేగవంతమవుతుంది. దరఖాస్తుల్లో తప్పులు, ధ్రువపత్రాల పరిశీలన, అర్హత నిర్ధారణ వంటి అంశాలను సకాలంలో పూర్తి చేసి అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల ఆమోద ప్రక్రియను కూడా వేగిరం చేశామని జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు.
జిల్లాలో 56,407 దరఖాస్తుల
స్వీకరణ
ఇప్పటివరకు 10,956 అప్లికేషన్స్ అప్రూవ్డ్ చేసిన అధికారులు
ఇంకా పెండింగ్‌లోనే 44,898 అర్జీలు
క్లియరెన్స్‌లో వేగం పెంచాలని కోరుతున్న పట్టభద్రులు
వరంగల్ మండలంలో అత్యధిక దరఖాస్తుల పెండింగ్..
దరఖాస్తుల పరిష్కారంలోనూ మండలాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. వరంగల్ మండలంలో అత్యధికంగా 11,393 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖిలా వరంగల్‌లో 9,926, నర్సంపేటలో 3,317, సంగెంలో 3,215, నెక్కొండలో 2,869, గీసుకొండలో 2,814 దరఖాస్తులు పరిష్కారం కావాల్సి ఉంది. మరోవైపు పర్వతగిరిలో 1,413, చెన్నారావుపేటలో 1,363, ఖానాపురంలో 947 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.


