నల్లబెల్లి: ఆర్టీసీ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నా, విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ డిప్యూటీ మేనేజర్ కిషన్‌రావు స్పష్టం చేశారు. నర్సంపేట డీఎం సరస్వతితో కలిసి బుధవారం నల్లబెల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ఆర్టీసీ స్థలాల్లో విగ్రహాలు, ఇతర నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్థానిక నాయకులకు సూచించారు. దీనిపై బీఆర్‌ఎస్ నాయకులు సట్ల శ్రీనివాస్‌గౌడ్, నాగెల్లి ప్రకాశ్, గుమ్మడి వేణు, నాగెల్లి శ్రీనివాస్, బూస సదయ్య స్పందిస్తూ.. విగ్రహాన్ని బస్టాండ్ ప్రాంగణంలో కాకుండా సమీపంలోని పార్కు వద్ద రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి తడుక అశోక్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు చింతకింది కుమారస్వామి, సామల దేవేందర్ కూడా తమ అభిప్రాయాలు అధికారి దృష్టికి తీసుకెళ్లారు. నాయకుల వివరణపై వరంగల్ రీజనల్ డిప్యూటీ మేనేజర్ స్పందిస్తూ రాజకీయాలకు అతీతంగా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా త్వరలోనే నల్లబెల్లి బస్టాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని డిప్యూటీ మేనేజర్ తెలిపారు. ప్రాంగణంలో కూరగాయలు, పండ్ల దుకాణాలు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
పిల్లర్ నిర్మించిన ఇద్దరిపై ఫిర్యాదు
ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అక్రమంగా సిమెంట్ పిల్లర్ నిర్మించిన ఇద్దరిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నర్సంపేట ఆర్టీసీ డిపో ట్రాఫిక్ సూపరింటెండెంట్ అట్లూరి పాల్సన్‌కుమార్ తెలిపారు. బస్టాండ్ ఆవరణలో స్థలాన్ని ఆక్రమించి నల్లబెల్లి ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, మాజీ సర్పంచ్ కొత్తపల్లి కోటిలింగాచారి సిమెంట్ పిల్లర్ నిర్మించారని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు, బస్సులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్ గుమ్మడి వేణు, మాజీ సర్పంచ్ కొత్తపల్లి కోటిలింగాచారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై సాయి ప్రసన్న కుమార్ తెలిపారు.
45 మందికి స్క్రీనింగ్ పరీక్షలు
నర్సంపేట రూరల్ : నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం సదరం క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ దామెదర బాయి మాట్లాడారు. మొత్తం 90 మంది దరఖాస్తు చేసుకోగా 45 మంది హాజరై స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్టు తెలిపారు. ఇద్దరిని న్యూరోలాజికల్ డిపార్ట్‌మెంట్ కోసం రెఫర్ చేశారని చెప్పారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ వరంగల్ రీజినల్ డిప్యూటీ
మేనేజర్ కిషన్‌రావు
నల్లబెల్లి బస్టాండ్ ప్రాంగణం పరిశీలన


