ఐనవోలు : అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను పూర్తి చేయాలని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు నిరసనగా తొలుత బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించగా, అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నంది సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టారు.
నాలుగేళ్లుగా పూర్తికాని రోడ్డు
కొండపర్తి నుంచి వరంగల్, దర్గా కాజీపేట, ఐనవోలుకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే అనుమతులు మంజూరయ్యాయి. రోడ్డు తవ్వి కంకరపోసి నాలుగేళ్లు కావొస్తున్నా ఇప్పటికి పనులు పూర్తి కాలేదు. దీంతో గ్రామస్తులు, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పలుమార్లు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అయినా రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది.
వాట్సాప్ పోస్టులు, కేసు..
రోడ్డు పూర్తి చేయాలని కొండపర్తి గ్రామ ఫాలోవర్స్ అనే వాట్సాప్ గ్రూప్‌లో స్థానిక యువజన సంఘాలకు చెందిన కట్కూరి శ్రావణ్‌కుమార్, అల్లందాస్ తరుణ్, కట్కూరి నెల్సన్ మెసేజ్ చేశారు. అయితే ఆ మెసేజ్‌లు ప్రభుత్వాన్ని, తమ పార్టీ నాయకులను అవమానించేలా, అసభ్యకరంగా ఉన్నాయని, అదే రోజు సాయంత్రం కొండపర్తి బస్టాండ్ వద్ద ప్రశ్నించినందుకు కట్కూరి నెల్సన్ తమను తిడుతూ చంపుతామని బెదిరించాడని ఆరోపిస్తూ కొండపర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గద్దల సుమన్ అక్టోబర్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బీఎన్‌ఎస్ 296(బీ), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా..
యువకుల అరెస్టు సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, బీఆర్‌ఎస్, బీజేపీ, ప్రజా సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. రోడ్డు సమస్యపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తారా, విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులేదా? రోడ్డుపై ప్రయాణం నరకయాతనగా ఉందని పోస్టులు పెడితే ఇంతా అమానుషంగా వ్యవహరిస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. గత నెలలో నమోదైన కేసు విచారణలో భాగంగానే అరెస్టు చేశామని ఎస్సై వివరణ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో
అనంతరం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నంది సెంటర్ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నిస్తే యువకులను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ గదిలో వేసి తలుపులు మూయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్, బీజేపీ, ప్రజా సంఘాలు, గ్రామస్తుల ధర్నా


