కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాధాన్యతనిస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్‌హాల్‌లో విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, విశ్రాంత ఆచార్యుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తాను అసెంబ్లీలోనూ యూనివర్సిటీ సమస్యలను ప్రస్తావించానని, సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 19లోపు యూనివర్సిటీని సందర్శించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కె.వెంకటనారాయణ మాట్లాడుతూ.. గత పదేళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న నష్టాలను విద్యావంతులు గమనించాలన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినవి మాత్రమే కాదని రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపే ఎన్నికలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థ్ధి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతస్థాయిలో ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. విద్యార్థి, అధ్యాపక సమస్యలపై గళం విప్పుతానని, తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్ అథారిటీ సభ్యుడు ప్రొఫెసర్ గాదె దయాకర్ మాట్లాడుతూ యూనివర్సిటీలో కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ఖాళీలపై ప్రభుత్వం దృషికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎన్‌ఎస్‌యూఐ కేయూ మాజీ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ‘కుడా’ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఆయూబ్‌ఖాన్, కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ఆచార్య బి.వెంకట్రామ్‌రెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ సాధు రాజేష్, కేయూ ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెకటరీ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 19లోపు యూనివర్సిటీకి
సీఎం వచ్చే అవకాశం
ఎమ్మెల్సీగా సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


