కాశిబుగ్గ: పాఠకులకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు ఇన్‌చార్జ్‌ల పాలన, అరకొర వసతులతో సతమతమవుతున్నాయి. పాఠకుల అభిరుచికి అనుగుణంగా అందించాల్సిన పాఠ్యపుస్తకాలు, సాహితీప్రియులకు కావాల్సిన గ్రంథాలు లేకపోవడంతో నిరాశ ఎదురవుతుంది. దీనితోడు జిల్లాలోని చాలా గ్రంథాలయాలు ఇన్‌చార్జ్‌లతో పనిచేయడం, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం కూడా ఇన్‌చార్జ్‌తోనే పనిచేస్తూ, నామమాత్రంగా నడుస్తుంది. వరంగల్ నగరంలోని ఎల్లంబజార్‌లో 1972 సంవత్సరంలో శాఖ గ్రంథాలయంగా ప్రారంభించారు. 2017 సంవత్సరంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు వరంగల్ అర్బన్, రూరల్‌లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని గీసుకొండలో ఏర్పాటు చేశారు. తర్వాత వరంగల్, హనుమకొండ జిల్లాలుగా మారినప్పుడు గీసుకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని తిరిగి వరంగల్ ఎల్లంబజార్‌లోని శాఖ గ్రంథాలయంలోకి మార్చారు. దీంతో ఈ శాఖ గ్రంథాలయం ప్రస్తుతం జిల్లా కేంద్ర గ్రంథాలయంగా మారింది. పేరుకే జిల్లా గ్రంథాలయం అయినా అభివృద్ధిలో వెనుకబడి ఉంది.
జిల్లాలో 12 శాఖ గ్రంథాలయాలు..
జిల్లాలో 12 శాఖ, 4 గ్రామ గ్రంథాలయాలు, పనిచేస్తున్నాయి. చాలా గ్రంథాలయాలు అరకొర వసతులతో సతమతమవుతున్నాయి. అలాగే ఇన్‌చార్జ్‌లతో నామమాత్రంగా నడుస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం మూడు గ్రంథాలయాల్లో మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. వీరు కూడా ఇతర గ్రంథాలయాలకు ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్న లైబ్రేరియన్ మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇన్‌చార్జ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే రీజినల్ గ్రంథాలయంలో పనిచేస్తున్న గెజిటెడ్ లైబ్రేరియన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. నర్సంపేట లైబ్రేరియన్ రాయపర్తి, వర్ధన్నపేట గ్రంథాలయాకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గీసుకొండ లైబ్రేరియన్ వరంగల్ జిల్లా గ్రంథాలయంలో ఇన్‌చార్జ్‌గా, పర్వతగిరి లైబ్రేరియన్ నెక్కొండ, సంగెం మండలాల గ్రంథాలయాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
సెస్‌తోనే అభివృద్ది
కార్యక్రమాలు..
జిల్లావ్యాప్తంగా ప్రజలు చెల్లిస్తున్న ఇంటి పన్ను ద్వారా వచ్చే గ్రంథాలయ సెస్ అభివృద్ధికి తోడ్ప డుతుంది. వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని గ్రామాల ద్వారా వచ్చిన ఇంటి పన్నులో 8 శాతాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి కెటాయిస్తున్నారు. ఈ నిధులతో ఆయా గ్రంథాలయాలకు సంబంధించిన మరమ్మతులు, నూతన భవనాలు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, పేపర్లు, స్టే షనరీ, పార్ట్ టైం వర్కర్లకు వేతనాలు చెల్లిస్తారు.
వసతులు కరువు
గ్రంథాలయాల్లో
అరకొర వసతులు
రెగ్యులర్ లైబ్రేరియన్లు లేకపోవడంతో స్వీపర్లే చూసుకుంటున్న వైనం
సెస్‌తోనే సిబ్బందికి వేతనాలు
జిల్లాలో 12 శాఖ, 4 గ్రామ
గ్రంథాలయాలు
జిల్లాలోని పలు గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ అరకొర వసతులు ఉన్నాయి. రాయపర్తి, వర్ధన్నపేట, నెక్కొండ, నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, ఉర్సు, ఎల్లంబజార్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. గీసుకొండ, సంగెంలోని గ్రంథాలయాలు అద్దె భవనంలో నడుస్తున్నాయి. గురజాల, రంగశాయిపేట, కరీమాబాద్, చెన్నరావుపేట, దుగ్గొండి, పర్వతగిరి ప్రాంతాల్లోని గ్రంథాలయాలు అద్దె లేకుండా పనిచేస్తున్నాయి. అయితే గ్రంథాలయాల్లో పనిచేస్తున్న లైబ్రేరియన్లు ఇన్‌చార్జ్‌లుగా ఉండటంతో వారు లేనప్పుడు ఆయా గ్రంథాలయాల్లో పనిచేసే స్వీపర్లు చూసుకోవాల్సి వస్తుంది.


