నర్సంపేట: ఒకప్పుడు వరంగల్ జిల్లా పప్పు దినుసులకు పెట్టింది పేరు. కంది, పెసర, మినుములు అంటే వరంగల్ గడ్డ నుంచే రాష్ట్రమంతా వెళ్లేది. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం ఏటేటా దారుణంగా పడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పప్పు దినుసు పంటలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒకప్పుడు ప్రధాన పంటలు ఇవే..
1980 – 90 దశకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కంది, మినుము, పెసర ఎక్కువగా సాగు చేసేవారు. వర్షాధార ప్రాంతాల్లో రైతులకు ఇదే ప్రధాన ఆదెరువు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీరు, భూమిని సారవంతం చేసే పంటలుగా వాటిని సాగు చేసేవారు. కానీ, ఇప్పుడు జిల్లాలో 2లక్షల 18వేల 112ఎకరాల సాగులో పప్పు దినుసుల సాగు 5 శాతం కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రస్తుతం కంది పంట 469.27 ఎకరాల విస్తీర్ణంలో, పెసర పంట 3, 141.38 ఎకరాల్లో సాగవుతున్నాయి.
అపరాల సాగు పడిపోవడానికి కారణాలు
గిట్టుబాటు ధర లేక: కంది, మినుములకు మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు కేంద్రాలు సరిపడా లేక దళారుల చేతిలో రైతులు నష్టపోవడం.
పత్తి, మిర్చి వైపు మొగ్గు: ఎక్కువ లాభం వస్తుందన్న ఆశతో రైతులు వాణిజ్య పంటలైన పత్తి, మిరప వైపు మళ్లడం.
కూలీల కొరత: పప్పు దినుసులకు కలుపు తీయడానికి, కోతకు ఎక్కువ మంది కూలీలు కావాలి. కూలీల ఖర్చు పెరగడంతో రైతులు వెనుకడుగు వేయడం.
వాతావరణ మార్పులు: సకాలంలో వర్షాలు లేకపోవడం, కురిస్తే అతి భారీ వర్షాలు కురవడం, తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గిపోవడం వల్ల పంటలు పప్పు దినుసు పంటలు రోజు రోజుకు పడిపోతూ వస్తోంది.
పోషకాహారంపై దెబ్బ: పప్పు దినుసులు తగ్గిపోవడం కేవలం రైతు సమస్యే కాదు. ప్రజల ఆరోగ్య సమస్య కూడా. ప్రొటీన్లకు ప్రధాన ఆధారమైన పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గితే మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటికే కందిపప్పు ధర కిలో రూ.160నుంచి రూ.180 వరకు పెరిగింది.
అధికారులు ఏం చేయాలి..
పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, విత్తన రాయితీ, యంత్ర పరికరాలు అందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే వరంగల్ గడ్డపై పప్పు దినుసు పంటల చరిత్ర పుటల్లో మిగిలిపోతుందని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలం కంది పెసర
(ఎకరాల్లో)
నర్సంపేట 33 363
చెన్నారావుపేట 40 320
దుగ్గొండి 27 650
ఖానాపురం 2 70
నల్లబెల్లి 50 853
నెక్కొండ 15 19
గీసుకొండ 56 89
ఖిలా వరంగల్ 45 271
పర్వతగిరి 16 54
రాయపర్తి 55 122
సంగెం 41 227
వరంగల్ 18.27 28.38
వర్ధన్నపేట 71 75
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. గతంలో పెసర, బొబ్బర్లు, కందులు, నువ్వులు పండించాను. ఆ పంటలకు దిగుబడి తక్కువగా రావడం, ఆశించిన ధర లేకపోవడంతో వరి, పత్తి, పసుపు లాంటి వాణిజ్య పంటల వైపు మళ్లాను. ఈ పంటలలో సైతం హైబ్రిడ్ వంగడాలు ఎక్కువై క్రిమి కీటకాలు బెడద పెరిగింది. పెట్టుబడులు కూడా పెరిగాయి. కూలీల కొరత పెరిగి ఇప్పుడు ఏ పంట వేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నా.
– పైసా కొమ్మాలు, కోనాపురం, చెన్నారావుపేట మండలం
పప్పు దినుసుల పంటలు కందులు, పెసర, మినుములు, బుడ్డశనగలు, కాబుల్ శనగలు, బొబ్బర్లు, ఉలవలు, చిక్కుడు, బటానీలు


