రాయపర్తి: ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆమె తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలు, గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసుల పురోగతి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, కేసుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ సంజీవరావు, స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్, స్టేషన్ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.
‘రాష్ట్రీయ ఏక్తాదివస్’కు బిక్కాజిపల్లి సర్పంచ్ రమేశ్
దుగ్గొండి: గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తానగర్‌లో జరగనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమానికి జిల్లా తరఫున బిక్కాజిపల్లి గ్రామ సర్పంచ్ బండారి రమేశ్ హాజరుకానున్నారు. తనను ఎంపిక చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద, జిల్లా పంచాయతీ అధికారి కల్పనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రమేశ్ గుజరాత్ రాష్ట్రానికి బయలుదేరారు. ఈ మేరకు పలువురు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆర్‌జీపీఆర్‌ఎస్‌లో
ఇద్దరికి చోటు
గీసుకొండ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అనుబంధ రాజీవ్ గాంధీ పంచాయత్‌రాజ్ సంఘటన్ (ఆర్‌జీపీఆర్‌ఎస్)లో గీసుకొండ మండలం నుంచి ఇద్దరికి చోటు లభించింది. సంఘటన్ జోన్ ఇన్‌చార్జ్‌గా రాంపురం గ్రామ సర్పంచ్ రడం భరత్, జిల్లా ఇన్‌చార్జ్‌గా సూర్యతండా సర్పంచ్, సేవాలాల్ బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ రాఘవేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఇద్దరి నియామక ఉత్తర్వులను సంఘటన్ చైర్మన్ డాక్టర్ సునీల్ పవార్ పేర వెలువడ్డాయి.
పథకాలను
వినియోగించుకోవాలి
నల్లబెల్లి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక భద్రతా పథకాలు, బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని వరంగల్ లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్‌డీఎం) గడ్డం జీవన్‌కుమార్ సూచించారు. శనిగరంలో యూని యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్లబెల్లి శాఖ గురువారం నిర్వహించిన ఆర్థిక సమ్మిళిత శిబి రంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువచేయడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో అర్హులు నమోదు చేసుకోవాలని సూచించారు. శిబిరంలో బ్యాంకు మేనేజర్ నగేశ్ పాల్గొన్నారు.
జీపీ కార్యాలయం తనిఖీ
దుగ్గొండి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి కల్పన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలోని వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి మహ్మద్ వాజిద్‌ను ఆదేశించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్‌ను పరిశీలించారు. కాంప్లెక్స్‌కు శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్ కోరారు. ఆమె వెంట మండల పంచాయతీ అఽధికారి చంద్రమోహన్, ఉప సర్పంచ్ పల్లె వైష్ణవిశ్యాం, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.


