జిల్లాలోని 179 ఆవాసాల్లో లీజుకు ప్రైవేట్‌ బావుల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని 179 ఆవాసాల్లో లీజుకు ప్రైవేట్‌ బావుల గుర్తింపు

Oct 30 2026 7:24 AM | Updated on Oct 30 2026 7:24 AM

● మరో రెండు హాబిటేషన్స్‌కు

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

● అత్యవసర ఏర్పాట్లకు రూ.90.72 లక్షల అంచనా వ్యయం

● ప్రణాళిక రూపొందించిన

మిషన్‌ భగీరథ అధికారులు

సాక్షి, వరంగల్‌: ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మిషన్‌ భగీరథ అధికారులు ముందస్తు ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌ ఇంట్రా డివిజన్‌న్‌ పరిధిలోని 11 మండలాల్లో 698 ఆవాసాల (హాబిటేషన్స్‌)కు నీటిని అందించేందుకు ఎల్‌నినో యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు. ఇందులో భాగంగా 179 ఆవాసాల్లో ప్రైవేట్‌ నీటి వనరుల (బావుల)ను లీజుకు తీసుకోవాలని గుర్తించారు. వీటితో పాటు మరో రెండు ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన సదరు నివేదికలో రూ.90.72 లక్షల అంచనా వ్యయమవుతుందని పేర్కొన్నారు.

ఏడు మండలాలకు కాస్త ఇబ్బందే..

ధర్మసాగర్‌, మధురిపురం, సింగరాజుపల్లి–పరకాల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా జిల్లాలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ధర్మసాగర్‌ ప్లాంట్‌ పరిధిలోని పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో 127 ఆవాసాలకు రోజువారీ డిమాండ్‌ 9.822 ఎంఎల్‌డీ ఉండగా.. 11.185 ఎంఎల్‌డీల నీరు సరఫరా అవుతోంది. 553 రోజుల పాటు ఇక్కడి నుంచే సరఫరా చేసే నీటి లభ్యత ఉంది. సింగరాజుపల్లి–పరకాల ప్లాంట్‌ పరిధిలో సంగెం, గీసుకొండ మండలాలకు 9.06 ఎంఎల్‌డీల డిమాండ్‌కు సమానంగా సరఫరా ఉంది. ఈ వనరు 115 రోజుల పాటు సరఫరా చేయగలదని గుర్తించారు. నర్సంపేట, నల్లబెల్లి, ఖానాపురం, దుగ్గొండి, చెన్నారావుపేట, రాయపర్తి, నెక్కొండ మండలాల్లోని 459 ఆవాసాలకు నీటిని అందించే మధురిపురం ప్లాంట్‌ పరిధిలోనే సరఫరా లోటు కనిపిస్తోంది. రోజువారీ డిమాండ్‌ 38.477 ఎంఎల్‌డీ కాగా, సరఫరా 33.567 ఎంఎల్‌డీగా ఉంది. నివేదిక ప్రకారం ఇక్కడ 4.878 ఎంఎల్‌డీల లోటు నమోదైంది. ఈ వనరు ప్రస్తుత అంచనా ప్రకారం 80 రోజుల వరకు సరిపోతుంది.

జలాశయాలకు నీటి పంపింగ్‌ కొనసాగితే..

పాలేరు రిజర్వాయర్‌కు నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ద్వారా, చలివాగు రిజర్వాయర్‌కు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నిరంతరంగా నీటిని అందిస్తే ప్రస్తుతం అంచనా వేసిన వ్యవధి కంటే ఎక్కువకాలం సరఫరా కొనసాగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిన పక్షంలో నీటి వనరుల లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షించడం, గుర్తించిన 179 ఆవాసాల్లో ప్రత్యామ్నాయ వనరులను సకాలంలో అందుబాటులోకి తేవడం, అవసరమైన రెండు ఆవాసాలకు కూడా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయడం కీలకం కానుందని అధికారులు పేర్కొన్నారు.

చేతి పంపుల

మరమ్మతులపై దృష్టి..

జిల్లాలో 698 ఆవాసాలకు నీటి నిల్వ, పంపిణీ కోసం 903 ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1,16,820 గృహాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,15,707 ఇళ్లకు అందించారు. మరో 1,113 గృహాలకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. గ్రిడ్‌ సరఫరాకు తోడు స్థానిక నీటి వనరులను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలో 2,534 చేతిపంపులకు 2,169, 715 సింగిల్‌ ఫేజ్‌ మోటార్లకు 690, 773 పీడబ్ల్యూఎస్‌ పథకాలకు 743, 473 బహిరంగ బావులకు 451 పనిచేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వచ్చే నెలలో పనిచేయని చేతి పంపులకు అధికారులు మరమ్మతులు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement