న్యూశాయంపేట: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజావాణికి కాకుండా సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లో దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు వర్క్ అడ్జెస్ట్‌మెంట్, డిప్యుటేషన్‌లకు సంబంధించిన దరఖాస్తు ఇచ్చేందుకు ప్రజావాణికి రాగా వారిని సున్నితంగా మందలించారు. ఏ శాఖకు చెందిన అధికారులు ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ప్రజావాణిలో 220 దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. రెవెన్యూశాఖ, 56, జీడబ్ల్యూఎంసీ 74, హౌసింగ్ 16, డీఆర్‌డీఓ 15 రాగా ఇతర శాఖలకు సంబంధించి 59 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిషోర్‌కుమార్, వై.వి.గణేశ్, జెడ్పీ సీఈఓ వసంత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఏఓ విశ్వప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
తనకు ఉండడానికి సొంత ఇల్లు లేదు. స్థలంతోపాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని వరంగల్ అబ్బనికుంటకు చెందిన దేశబోయిన సరిత కలెక్టర్‌కు విన్నవించారు.
నల్లబెల్లి మండల కార్యాలయం ఇరుకుగా ఉందని, ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలోకి మార్చాలని ప్రజలు విన్నవించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, స్వేరోస్ నాయకులు బొట్ల నరేష్, శనిగరపు రాజేంద్రప్రసాద్, ఒంటరి చక్రిలు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
గ్రీవెన్స్‌లో 220 దరఖాస్తులు


