నల్లబెల్లి: మండలంలోని ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. యూరియా పంపిణీలో మెరుగైన సేవలు అందించేందుకు ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎఫ్‌ఎఫ్ ఎస్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) యాప్‌లో యూరియా బుక్ చేసుకున్న రైతులకు ఒక యూరి యా బస్తా కోసం అవసరం లేని పురుగు మందులు కొనాల్సిన దుస్థితి నెలకొంది. యూరియా కావాలంటే గంట మందు, గడ్డి మందు, పురుగు మందు, నానో యూరియా, కలుపు మందులు తమవద్దే తీసుకోవాల్సిందేనని లింక్ పెడుతున్నారు. దీంతో రైతులు అవసరం లేకపోయినా వాటిని కొనుగోలు చేస్తుండడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ దందా బహిరంగంగానే కొనసాగుతున్నా.. వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
నిర్లక్ష్యంగా వ్యవసాయ శాఖ
ఎరువుల డీలర్లు, సహకార సంఘాలు లింక్ దందాతో రైతులను మోసం చేస్తున్నా.. వ్యవసాయాధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాల్సిన వ్యవసాయ శాఖ నామమాత్రపు తనిఖీలతో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
పురుగు మందులు కొనుగోలు
చేస్తేనే యూరియా!
అవసరం లేకున్నా రైతులకు
అంటగడుతున్న ఫర్టిలైజర్స్ యజమానులు
ఆర్థికంగా నష్టపోతున్న అన్నదాతలు
జిల్లాలో సుమారు 1,000 షాపులు
చర్యలు తీసుకుంటాం..
రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు మాత్రమే ఇవ్వాలి. వ్యాపారులు రైతులతో బలవంతంగా వేరే మందులు కొనిపించడం సరికాదు. రైతులు ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తీనుకొని లైసెన్సులను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటాం. – బన్న రజిత, ఏఓ, నల్లబెల్లి


