గీసుకొండ: గ్రామ పంచాయతీల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ రికార్డులను పక్కాగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన అన్నారు. మంగళవారం మండలంలోని దస్రుతండా, సూర్యతండా గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయాల్లోని రిజిస్టర్లు, రోజువారీ కార్యకలాపాల నమోదును పరిశీలించారు. పంచాయతీల్లో డిజిటలైజేషన్‌నకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత యాప్‌లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందరర్భంగా డీపీఓ కల్పన మాట్లాడుతూ వినాయక చవితి నేపథ్యంలో మండపాల పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న రహదారులు, డ్రెయినేజీ, మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. విధుల్లో అలసత్వం, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ తనిఖీల్లో ఎంపీఓ తిరుణహరి శేషాంజన్ స్వామి, పంచాయతీ కార్యదర్శులు వినోద్, వీరేష్ పాల్గొన్నారు.
డీపీఓ కల్పన


