● డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి
గీసుకొండ/సంగెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజారెడ్డి వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. గీసుకొండ మండలంలోని ధర్మారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, గీసుకొండ పీహెచ్‌సీ, సంగెం మండలంలో చింతలపల్లి పల్లె దవాఖానా, సంగెం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులకు నిర్దేశిత టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో లక్ష్యాలను సాధించేలా పనిచేయాలని ఆదేశించారు. గీసుకొండ పీహెచ్‌సీ పరిసరాలను శుభ్రం చేయించాలని వైద్యాధికారి శౌర్య శరణ్యకు సూచించారు. మాతాశిశు ఆరోగ్య సేవలకు ప్రాధాన్యతనిస్తూ సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించకుంటే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి ఈ సందర్భంగా సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక వైద్యాధికారులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ జి.నవీన్, హెచ్‌ఈఓ సాంబయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఎస్.వెంకటేశ్వర్లు, డిప్యూటీ డెమో, హెచ్‌ఈఓ సదానందం, సిబ్బంది సాంబయ్య తదితరులు ఉన్నారు.


