గ్రామ, వార్డు సభల్లో వేలాది మందికి జారీ
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి వైనాల శ్రీనివాస్ నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన దివ్యాంగుడు. వీరి కుటుంబ సభ్యులు మూడు తరాలుగా ఇదే గ్రామంలో నివసిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సర్ ప్రక్రియలో వివరాలు నమోదు చేసినప్పుడు 2002 ఓటరు జాబితాలో శ్రీనివాస్, వారి వారసుల వివరాలు లభించలేదు. దీంతో అధికారులు నోమ్యాపింగ్‌లో చేర్చారు. ఈనెల 25న అధికారులు నోటీసు ఇవ్వడంతో ఆధార్‌కార్డు, నివాసం సర్టిఫికెట్, జిరాక్స్ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అధికారులకు వివరాలు సమర్పించారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్‌లోని విద్యానగర్‌కు చెందిన గొల్లపల్లి రజినీకాంత్. ఇతడు నింపిన ఎన్యూమరేషన్ పత్రంలో తల్లిదండ్రులకు సంబంధించి 2002 ఓటరు జాబితా వివరాలు సరిగా లేవు. అయినా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు వచ్చింది. నోలింకేజీ కింద వివరాలు సరిపోలవడం లేదని నోటీసు ఇచ్చారు. ఫోర్ట్‌రోడ్డు విద్యానగర్ కాలనీ 126 పోలింగ్ బూత్ పరిధిలోనే నివాసముంటున్న ఇతడు పాత, ప్రస్తుతం సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి ఓటు ఉండేలా చూడాలంటున్నాడు.
సాక్షి, వరంగల్: జిల్లాలో గురువారం జరిగిన సర్ వార్డు, గ్రామ సభల్లో నోటీసుల పరంపర కొనసాగింది. అడ్రస్‌లు సరిగా లేనివారు, పొలింగ్ స్టేషన్లు సరిగా చెప్పనివారు, పేర్ల అక్షరాల్లో తప్పులుండడం, ఇంటి పేరులో తప్పిదాలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారు 2002 నాటి ఓటరు జాబితా సరిగా తెలియని వారు.. తదితర కారణాలున్నవారికి నోలింకేజీ పేరుతో నోటీసులు ఇచ్చారు. గ్రామసభ, వార్డు సభలకు వచ్చినవారికి నోటీసులిస్తూనే రానివారికి కూడా దశలవారీగా నోటీసుల ప్రక్రియ పూర్తి చేయడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా 1,94,399 మందికి సర్‌లో తప్పిదాలు ఉన్నాయంటూ నోటీసులు ఇస్తున్నారు. నోటీసుల్లో పొందుపరిచిన తేదీ ప్రకారం కేటాయించిన పొలింగ్ కేంద్రానికి వచ్చి బీఎల్‌ఓలకు ధ్రువీకరణ పత్రాలు అందిస్తే ఓటు ఉండే అవకాశముంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోనుంది. అందుకే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఓటర్లను మార్గదర్శనం చేస్తూ ఓటరు జాబితాలో ఉండేలా దృష్టి కేంద్రీకరించాయి.
సిటీలో రెంటర్స్‌కే ఎక్కువ నోటీసులు..
వరంగల్ సిటీలో చాలావరకు నోలింకేజీ కింద ఎక్కువ నోటీసులు అద్దెదారులకు వచ్చినట్లు తెలుస్తోంది. 2002లో ఎక్కడో నివసించారో అనే వివరాలు, అప్పటిఓటరు జాబితాలో అడ్రస్ ఎక్కడుందో తెలియక చాలా మంది ఎన్యూమరేషన్ పత్రంలో కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయలేదు. వీరిలో చాలా మంది ఇప్పుడూ సొంతిళ్లు కట్టుకున్నారు. 2002 నాటి ఓటరు జాబితా వివరాలు లేకపోవడంతో అత్యధిక మంది రెంటర్స్‌కు నోటీసులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పిస్తే ఓటు పదిలంగా ఉండనుంది. ఇతర ప్రాంతాల్లో ఇన్నాళ్లు ఉద్యోగం చేసి కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడా శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నవారు సైతం 2002 ఓటరు జాబితా వివరాలు తెలియనివారు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారని నగరంలోని ఓ బీఎల్‌ఓ శశికళ తెలిపారు. ఆంధ్రావాళ్లు సైతం ఏపీలో తల్లిదండ్రులు, ఇక్కడా పిల్లలు సర్‌లో పేరు నమోదు చేసున్నవారు సైతం ఉన్నారు. పట్టణాలు, గ్రామాల్లో సైతం 2002 ఓటరు జాబితాలో కుటుంబ వివరాలు సరిగా నమోదు చేయనివారు, వాటితో వివరాలు అనుసంధానం కానివారే ఎక్కువగా ఉండడం గమనార్హం.
2002 నాటి ఓటరు జాబితా ప్రకారం లేనివారే ఎక్కువ
కుటుంబ సభ్యుల వివరాలు లేక
అయోమయం
అడ్రస్‌లు, ఇంటిపేర్లు, పీఎస్‌ల
తప్పులు సైతం


