ఖానాపురం: ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ విద్యాబోధన చేస్తారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శ్రీధర్‌సుమన్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గురువారం నోట్‌బుక్స్, బ్యాగులు, షూ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వి నియోగం చేసుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా ఉత్తమ ఫలితాల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం వృక్ష రక్షాబంధన్, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రాగి రవికుమార్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ పరాచికపు సదానందం, అధ్యాపకులు శోభ, విజయ్‌కుమార్; తిరుపతమ్మ, రమాదేవి, సంజీవ, రాజేశ్, కేశవరెడ్డి, అనిల్, పాల్గొన్నారు.
గుట్కాలు స్వాధీనం
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని నవదుర్గ ఎంటర్ ప్రైజెస్ షాపులో గురువారం పోలీసులు దాడులు చేశారు. రూ.2.20 లక్షల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని పరమార్ పూరన్‌సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.
దొంగ అరెస్ట్
గీసుకొండ: డీసీఎం వాహనంలోని నగదును దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన తాటికంటి భాస్కర్ నాలుగు సంవత్సరాలుగా స్థానిక బెల్‌బ్రాండ్ కంపెనీలో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 21న డ్రైవర్ కుళ్ల సురేశ్, వరంగల్ కొత్తవాడకు చెందిన హెల్పర్ యాద గణేశ్‌తో కలిసి ఆయన డీసీఎం వాహనంలో స్వీట్లు, బేకరీ తినుబండారాలు విక్రయించేందుకు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు వెళ్లాడు. అమ్మకాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు జాన్‌పాక వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌పంపు వద్ద డీజిల్ పోయించడానికి డీసీఎం ఆపాడు. వాహనంలోని నగదు ఉన్న బ్యాగుకు తాళం వేసి కిందికి దిగాడు. బిల్లు తీసుకుని తిరిగి వాహనం వద్దకు రాగా అందులో హెల్పర్ గణేశ్ కనిపించలేదు. నగదు బ్యాగును కోసి రూ.1.50 లక్షల నగదును గణేశ్ దొంగిలించి పరారైనట్లు గుర్తించాడు. ఈ విషయమై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం గణేశ్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.20 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
గీసుకొండ: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందిన ఘటన వరంగల్–నర్సంపేట రహదారిపై గురువారం చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. సంగెం మండలం వంజరుపల్లి గ్రామానికి చెందిన గోనె సమ్మయ్య (70) మధ్యాహ్నం 3 గంటలకు తన మోపెడ్‌పై వ్యవసాయ పనిముట్ల వెల్డింగ్ కోసం వరంగల్–నర్సంపేట రహదారిలో కొమ్మాల వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న కారు కొమ్మాల స్టేజీ సమీపంలో వేగంగా వచ్చి సమ్మయ్య వెళ్తున్న మోపెడ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సమ్మయ్యతోపాటు మోపెడ్‌ను కారు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈఘటనలో అతడు అక్కడే మృతి చెందాడు. కారును అజాగ్రత్తగా నడిపిన గంగారం మండలం కోమట్లగూడేనికి చెందిన డ్రైవర్ వనం ప్రమోద్‌కుమార్‌పై మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
‘కేఎంసీ’ సందర్శన
కాశిబుగ్గ: కేఎంసీలోని క్షయ నివారణ కేంద్రాన్ని హనుమకొండ ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.రోహిత్ నేత గురువారం సందర్శించారు. ఈసందర్భంగా క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానం గురించి ఇన్‌చార్జ్ టీబీ నివారణ అధికారి డాక్టర్ ప్రదీప్‌రెడ్డి వివరించారు. అదేవిధంగా ఓపీ సేవలు, ట్రునాట్ ల్యాబ్ గురించి తెలిపారు.


