ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

సంగెం: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబెల్లి శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి నవీన, రవీందర్‌ దంపతులకు కుమారుడు శ్రీకాంత్‌ (26), ఒక కూతురు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం రవీందర్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. నవీన కూతురు వివాహం జరిపించగా కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్లుగా మంచిర్యాల జిల్లా హాజిపూర్‌కు చెందిన గౌరిశెట్టి సాహితి, శ్రీకాంత్‌ ప్రేమించుకుంటున్నారు. ఆమె తల్లిదండ్రులకు శ్రీకాంత్‌ చాలా సార్లు డబ్బులు పంపించాడు. ఇటీవల సాహితి తల్లిదండ్రులు కొత్తపల్లికి వచ్చి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె పోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. తనపై కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రేమ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశారని శ్రీకాంత్‌ తల్లితో చెప్పి ఆవేదన చెందుతుండేవాడు. మనస్తాపం చెందిన ఆయన మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకుని, ఈ నెల 26న ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి తల్లికి చెప్పాడు. వెంటనే నర్సంపేటలోని ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున శ్రీకాంత్‌ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. శ్రీకాంత్‌ మృతితో కొత్తపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సూసైడ్‌ నోట్‌లో శ్రీకాంత్‌ రాసుకున్న

వివరాలు..

‘ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలోకి ప్రేమ పేరుతో ఒక బంధం వచ్చింది. మంచిర్యాల జిల్లా హాజిపూర్‌కు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆమె తల్లిదండ్రులను ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం చేశా. కానీ, చివరికి ఆమె కుటుంబ సభ్యులు నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నారు. పెళ్లి కోసం 25 తులాల బంగారం పెట్టాలని ఒత్తిడి చేశారు. హైదరాబాద్‌లో ప్లాట్‌ తీసుకోవాలని చెప్పగా ప్లాట్‌ తీసుకున్నా. బావమరిది కూడా కట్నం పేరుతో 10 తులాల బంగారం కావాలని ఒత్తిడి చేశాడు. నాదగ్గర ఉన్నదంతా పెట్టడానికి ఒప్పుకున్నా. అంతేకాకుండా ఆస్తి పత్రాలను తీసుకుని వాటిని అమ్మాయి పేరుపై మార్చాలని చెప్పారు. చివరికి సాహితి కుటుంబం నన్ను మోసం చేసింది. నా మీద కేసు నమోదు చేయిస్తాను అని బెదిరించింది. నేను భరించిన బాధకు ముగింపు ఇవ్వు. మరో జన్మ ఉంటే ఈ బాధలు లేని జన్మ ఇవ్వు దేవుడా ఇక సెలవు’ అని శ్రీకాంత్‌ సూసైడ్‌ నోట్‌ రాసి వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నాడు.

సంగెం మండలం కొత్తపల్లిలో విషాదం

మరో జన్మ ఉంటే బాధలు లేని జీవితం ఇవ్వు అని దేవుడిని ప్రార్థిస్తూ సూసైడ్‌ నోట్‌.. వాట్సాప్‌లో స్టేటస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement