హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్‌లో ఒక్కసారిగా 90మంది ఔట్‌సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్‌లో మొత్తం 274మంది ఔట్‌సోర్సింగ్ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన తెలుపుతూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్‌సోర్సింగ్ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మర్నాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్‌కు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరో పించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైర్హాజరుకు రూ.600కు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈవిషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు.
రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశాను..
నేను శుక్రవారం రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశా. మర్నాడు డ్యూటీకి రమ్మని అధికారులు చెప్పారు. తెల్లారేసరికి నన్ను తొలగించారని తెలిసింది. నా భర్తకు ప్రమాదం జరిగి ఇంటి వద్దనే ఉంటున్నాడు. నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఆగమయ్యే పరిస్థితులున్నాయి.
– అనూష, ఔట్‌సోర్సింగ్ కండక్టర్,
హనుమకొండ డిపో
ఏడాది కాలంగా చేస్తున్నా..
హైదరాబాద్‌లో హోమ్ లోన్స్‌లో పనిచేసే నేను.. ఆర్టీసీ ప్రభుత్వానిది కావడంతో రెగ్యులర్ అవుతుందని కండక్టర్ ఉద్యోగంలో చేరా. కాంట్రాక్టర్‌కు కొంత సొమ్ము కూడా ముట్టజెప్పా. ఇప్పుడు కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడం లేదు. మధ్యలోనే తొలగించడంతో మేం వీధిన పడే పరిస్థితి నెలకొంది.
– ఐలయ్య, ఔట్‌సోర్సింగ్ కండక్టర్,
నర్సంపేట డిపో
వెట్టి చాకిరి చేయించుకున్నారు..
ఔట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యో గం కోసం ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. వీరికి నెలకు రూ.18వేల వేతనం ఇచ్చారు. ఏడాది పని చేస్తే వీరికి రూ.2,16,000 వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడినా భవిష్యత్‌లో రెగ్యులర్ అవుతుందన్న ఆశతో ఉద్యోగంలో చేరితే మధ్యలోనే తొలగించి అన్యాయం చేశారు.
– గాదె మహేందర్, బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి
ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ
వరంగల్ రీజియన్‌లో మొత్తం 274మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు
ఆర్‌ఎం కార్యాలయం ఎదుట
బాధితుల ధర్నా..
మా కుటుంబాలు
రోడ్డున పడ్డాయని ఆవేదన
తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్


