ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్లుంది : రేవూరి | - | Sakshi
Sakshi News home page

ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్లుంది : రేవూరి

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

భూసేకరణకు సహకరించాలి

గీసుకొండ: ‘ఏనుగు పోతుంటే వెనుక కుక్కలు మొరిగినట్లు ఉంది కొందరి తీరు.. నా వయస్సు గురించి మాట్లాడుతున్నారు.. నా వయసేంటో పనిలో చూపిస్తా.. 25 ఏళ్ల కుర్రాడిలా పని చేస్తా’ అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మరియపురం సమీపంలోని ఎస్‌ఎస్‌ గార్డెన్‌లో శనివారం స్మార్ట్‌రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరు ఏమనుకున్నా నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన పనితీరును మెచ్చుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ తననే ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరడంలో తప్పేముందని అన్నారు. పరకాలలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, ప్రతి మండలానికి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గీసుకొండ, సంగెం మండలాలతో పాటు 15,16,17 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు స్మార్ట్‌కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్‌, రాజ్‌కుమార్‌, ఇక్బాల్‌, కాంగ్రెస్‌ నాయకులు చాడ కొమురారెడ్డి, భీమగాని సౌజన్య, దాడి శివ, తుమ్మనపల్లి శ్రీనివాస్‌, ఆకుల రుద్రప్రసాద్‌, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వీడాలి

నెక్కొండ: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని, విధుల్లో నిర్లక్ష్యం వీడాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప న అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం గ్రామ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆమె సూచించారు. చెత్తాచెదారాన్ని డంపింగ్‌ వార్డుకు తరలించేందుకు అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, కార్యాలయ రికార్డులను అప్డేట్‌ చేయాలని ఆమె కోరారు. సమావేశంలో ఎంపీఓ శ్రీధర్‌, జీపీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మట్టెవాడ ఓపెన్‌ స్కూల్‌

సెంటర్‌ కోఆర్డినేటర్‌పై వేటు

కాళోజీ సెంటర్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఏప్రిల్‌–2026 పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి అభ్యాసకుల ఫీజు చెల్లింపులో ‘ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్ల మాయజాలం’ శీర్షికన సాక్షిలో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు స్పందించి మట్టెవాడ సెంటర్‌ కోఆర్డినేటర్‌ వి.అజయ్‌బాబును బాధ్యతల నుంచి తప్పించారు. మరో టీచర్‌ కె.రాజుకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించినట్లు పాఠశాల హెచ్‌ఎం ఓదెల శ్రీనివాస్‌ తెలిపారు. రాజు సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నట్లు చెప్పారు. విచారణ చేపట్టి నివేదికను విద్యాశాఖ అధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

రాయపర్తి: నష్కల్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ భూసేకరణకు గ్రామస్తులు, రైతులు సహకరించాలని ఆర్డీఓ సుమ సూచించారు. కొలన్‌పల్లి, కేశవాపురం, బురహాన్‌పల్లి గ్రామాల్లో నష్కల్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ భూ సేకరణపై శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సుమ మాట్లాడారు. భూసేకరణకు సంబంధించిన అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. తహసీల్దార్‌ ముల్కనూరి శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ త్రినాథ్‌, సర్పంచ్‌లు వంగాల ఎల్లమ్మయాకయ్య, గుజే సుధాకర్‌, ఉమాదేవి, ఆర్‌ఐ కొయ్యడ చంద్రమోహన్‌, ఉపసర్పంచ్‌ చెదలు భిక్షపతి, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement