రాత్రివేళ చైల్డ్ హెల్ప్‌లైన్–1098 కార్యాలయానికి తాళం
● ఆపదలో అండగా ఉండాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా
● భద్రత పేరుతో ‘ఫార్వర్డ్ కాలింగ్’ వైపు మొగ్గు
● కలెక్టర్ ఆదేశాలున్నా నిరంతర సేవలకు బ్రేక్
సాక్షి, వరంగల్: చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు వచ్చే ప్రతి కాల్ సాధారణ ఫోన్‌కాల్ కాదు.. అవతలి వైపు ఏడుస్తున్న బాలుడు, వేధింపులకు గురవుతున్న చిన్నారి, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లవాడు, బాలకార్మికుడు అయి ఉండొచ్చు. తక్షణ వైద్యం లేదా రక్షణ అవసరమైన వారు కావొచ్చు. అలాంటి సమయంలో కాల్ చేసిన వెంటనే స్పందన రాకపోతే ఆ నిమిషాల ఆలస్యం కూడా ప్రమాదకరమే. నిరంతరం సేవలు అందించాల్సిన 1098 ఆఫీస్‌కు తాళం పడితే బాలల రక్షణ వ్యవస్థకు అర్థమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తరచుగా ఫార్వర్డ్ కాల్ ఆప్షన్‌తో తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లకు కాల్స్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటూ రాత్రివేళ ఇంట్లో ఉంటున్నారని సమాచారం. దీనికి ఇక్కడ అధికారి ఒకరు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హెల్ప్‌లైన్‌కు సంబంధించిన వివరాలు అడిగితే గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
కలెక్టర్ ఆదేశాలు ఏమైనట్టు..?
బాలల సంరక్షణ కోసం 2015 జేజే యాక్ట్ నిబంధనలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం చైల్డ్ హెల్ప్‌లైన్ నిరంతరం అందుబాటులో ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. 6 నెలల క్రితం బాలసముద్రంలోని బాలరక్షాభవన్‌ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించిన సందర్శించారు. ఎస్‌ఓపీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చైల్డ్‌లైన్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అవి పాటించడంలో సిబ్బంది వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్ ఆదేశాలనే అమలు చేయలేని పరిస్థితి ఉంటే.. బాలల రక్షణ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న యంత్రాంగం ఏం చేస్తోంది? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. భద్రతాపరంగా సీసీ కెమెరాలు, వాచ్‌మన్ ఉన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మూడో అంతస్తుకు తరలించినా సాయంత్రం, రాత్రివేళ హెల్ప్‌లైన్ సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి.
వీటికి సమాధానం చెప్పాల్సిందే..
బాలల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. అధికారులున్నారు. నిబంధనలున్నాయి. నిరంతర సేవలంటున్నారు. భద్రతా ఏర్పాట్లు చేశామంటున్నారు. కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోతే ఆ వ్యవస్థ ఎవరి కోసం? కలెక్టర్ ఆదేశాల తర్వాత కూడా పరిస్థితి ఎందుకు మారలేదు? 1098 కార్యాలయం రాత్రివేళ తప్పనిసరిగా పనిచేస్తోందా? ప్రతి షిఫ్ట్‌లో సిబ్బంది హాజరు, విధి నిర్వహణపై పర్యవేక్షణ ఉందా? సమస్య ఉంటే ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదు? 1098కు వచ్చిన అత్యవసర కాల్స్‌కు స్పందనలో ఆలస్యమైతే బాధ్యత ఎవరిది? కలెక్టర్ స్వయంగా ఇచ్చిన ఎస్‌ఓపీ అమలు ఆదేశాలను పర్యవేక్షిస్తున్నది ఎవరు? ఇవి కేవలం అధికారులపై ప్రశ్నలు కాదు.. ఆపదలో ఉన్న ప్రతి బాలుడి తరఫున అడగాల్సిన ప్రశ్నలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. బాలల రక్షణ వ్యవస్థలో చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే 1098 ఆఫీస్‌కు తాళం పడకుండా చూడడం కంటే.. ఆపదలో ఉన్న బాలుడికి తక్షణం తలుపు తెరిచే వ్యవస్థను బలోపేతం చేయడమే జిల్లా యంత్రాంగం ముందున్న అసలు బాధ్యత అంటున్నారు.. కలెక్టర్ ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతాయా? 1098 మళ్లీ నిజమైన 24X7 బాలల ఆపన్నహస్తంగా మారుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలు, 1098 కార్యాలయానికి తాళంపై జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణిని ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
ఇంటి అనుమతుల వివరాలు ఇవ్వాలి
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఏడాదిగా మంజూరైన ఇంటి అనుమతుల వివరాలు ఇవ్వాలని అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ వార్డుల వారీగా ఎన్ని అనుమతులు ఇచ్చారో వివరాలు అందించాలని పేర్కొన్నారు.


