న్యూశాయంపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ కోసం ప్రతిఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేట్ కళా శాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం ఈ–పాస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానంలో పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించేందుకు మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యార్థి తప్పనిసరిగా మీసేవ కేంద్రంలో ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసిన అనంతరం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం హనుమకొండలోని బీసీ సంక్షేమాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
గీసుకొండ: పామాయిల్ రైతు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు చాడా కొమురారెడ్డి తెలిపారు. మండలంలోని కొనాయమాకుల రైతుల వేదికలో గురువారం కొమురారెడ్డి అధ్యక్షతన పామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు. ముందుగా రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంద్యాల కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా చాడా కొమురారెడ్డి, గుడిపూరి అరుణ, ప్రధాన కార్యదర్శిగా కుంచారపు వెంకట్‌రెడ్డి, కోశాధికారిగా బుస్సారి బాబురావు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 19న నర్సంపేటలో నిర్వహించే సర్వసభ్య సమవేశంలో జిల్లా పామాయిల్ రైతుల సమస్యలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
కానిస్టేబుళ్లకు
నగదు పురస్కారం
కాజీపేట అర్బన్: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని వరంగల్ పొలీస్ కమిషనర్ శ్వేత మడికొండ పీఎస్ కానిస్టేబుళ్లు సంపత్, గోవర్ధన్‌ను గురువారం అభినందించారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలోని సాయినాథ్ వెంచర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కరీమాబాద్‌కు చెందిన మెరుగు పవన్ ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన మడికొండ కానిస్టేబుళ్లు పవన్‌ను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను కాపాడినందుకు కానిస్టేబుళ్లు గోవర్ధన్, సంపత్‌ను సీపీ శ్వేత నగదు పురస్కారం అందించి సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పనులు వేగిరం చేయండి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పరిపాలన భవన నిర్మాణ పనుల పురోగతిని గురువారం కమిషనర్ టి.వెంకన్న తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి, గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలిచ్చారు. మ్యూజియం ప్రాంగణంలోని శిల్పాలను పురావస్తు శాఖ ద్వారా సురక్షితంగా తగిన ప్రదేశానికి తరలించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు.


