అమృత్‌ భారత్‌ పనుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ భారత్‌ పనుల తనిఖీ

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

అమృత్‌ భారత్‌ పనుల తనిఖీ మెరుగైన వైద్య సేవలందించాలి ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కానిస్టేబుళ్లకు నగదు పురస్కారం

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌లో కొనసాగుతున్న అమృత్‌ భారత్‌ స్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ పనులను గురువారం సికింద్రాబాద్‌ డివిజన్‌ అడిషనల్‌ రైల్వే మేనేజర్‌ (ఐ) ముత్యాలనాయుడు తనిఖీ చేశారు. ఆయన సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక స్పిక్‌లో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం ముత్యాల నాయుడు కాజీపేట జంక్షన్‌ లోపల, స్టేషన్‌ బయట జరుగుతున్న అమృత్‌ భారత్‌ పనులు క్షణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం స్పిక్‌లో సికింద్రాబాద్‌కు తరలివెళ్లారు. ఆయన వెంట సికింద్రాబాద్‌ డీఈఎన్‌ సెంట్రల్‌ ప్రంజల్‌ కేశర్‌వాణి, కాజీపేట రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ అగ్గి రవీందర్‌, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌గోపాల్‌, రైల్వే ఐఓడబ్ల్యూ శ్రీనివాస్‌, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఫార్మసీ అధికారులు, నర్సింగ్‌ అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ ఎ.అప్పయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఫార్మసీ అధికారులు, నర్సింగ్‌ అధికారులతో ఆయన వేర్వేరుగా సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. ఫార్మసీ అధికారులు ఈ–ఔషధి పోర్టల్‌లో మందుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మాత్రమే రిఫర్‌ చేయాలని సూచించారు. సమావేశాల్లో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ టి. మదన్‌మోహన్‌ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రదీప్‌రెడ్డి, మాతా–శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి రజిత, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శ్రీకృష్ణారావు, ఎన్‌సీడీ కార్యక్రమ అధికారి డాక్టర్‌ మురళి, డెమో అశోక్‌ రెడ్డి పాల్గొన్నారు.

కాజీపేట: ఈఏడాది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్లలో చేరేందుకు రెండో విడత దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15 వరకు పెంచినట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ పొన్నాల వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానికల్‌ ట్రేడ్‌లలో (ఏటీసీ కోర్సులు) అడ్వాన్స్‌డ్‌ సీఎస్‌సీ మెషినింగ్‌ టెక్నీషియన్‌, ఇంజనీరింగ్‌ డిజైన్‌ టెక్నీషియన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌, ఇండస్ట్రియల్‌ రోబొటిక్స్‌ డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌, మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌లో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో రూ.100 రుసుంతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొదటి విడత దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

కాజీపేట అర్బన్‌: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని వరంగల్‌ పొలీస్‌ కమిషనర్‌ శ్వేత.. మడికొండ పీఎస్‌ కానిస్టేబుళ్లు సంపత్‌, గోవర్ధన్‌ను గురువారం అభినందించారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలోని సాయినాథ్‌ వెంచర్‌ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కరీమాబాద్‌కు చెందిన మెరుగు పవన్‌ ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన మడికొండ కానిస్టేబుళ్లు పవన్‌ను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను కాపాడినందుకు కానిస్టేబుళ్లు గోవర్ధన్‌, సంపత్‌ను సీపీ శ్వేతరెడ్డి నగదు పురస్కారం అందించి సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, మడికొండ ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌, ఎస్సైలు రాజబాబు, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement