కాశిబుగ్గ: సమాన పని–సమాన స్టైఫండ్ నినాదంతో హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహిస్తున్న ఆయుష్ హౌస్ సర్జన్ల సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ముందుగా.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సమ్మెకు సంఘీభావం
అలోపతిక్ డాక్టర్లతో సమానంగా ఉపకార వేతనాలివ్వాలని ఆయుష్ హౌస్ సర్జన్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు అనంతలక్ష్మి పూర్వ వైద్య విద్యార్థులు డాక్టర్ హరిరమాదేవి, డాక్టర్ రాజేశ్వరి సంపూర్ణ మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థుల నిరసన శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడారు.
సమ్మెలో పాల్గొంటే క్రమశిక్షణాచర్యలు
హౌస్సర్జన్ల సమ్మెకు సంఘీభావం తెలిపితే క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూయ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెలో యూజీ విద్యార్థులు పాల్గొనరాదని, ఒకవేళ పాల్గొంటే వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తానన్నారు. దీనిపై హౌస్సర్జన్లు మాట్లాడుతూ.. డిమాండ్లను పరిష్కరించే సమయంలో ఆంక్షలు విధిస్తూ, సమస్యను జఠిలం చేస్తున్నారన్నారు. ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలన్నారు.
తెలంగాణ ఆయుష్ జాయింట్
యాక్షన్ కమిటీ


