వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలోని పాత మున్సిపాలిటీ భవనాన్ని మున్సిఫ్ కోర్టుకు కేటాయించి పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. జిల్లా జడ్జి నిర్మలాగీతాంబ శనివారం సందర్శించి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కోర్టు కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందు కు వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
18న ప్రత్యేక లోక్ అదాలత్
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 18న ప్రత్యేకలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇరుపక్షాలు రాజీమార్గంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు పేర్కొన్నారు. దీనిపై మళ్లీ పైకోర్టుల్లో అప్పీలు చేసుకునే ఆవకాశం ఉండదని, వివాదానికి అక్కడితో పూర్తి ముగింపు పడుతుందని వివరించారు. డీఎల్‌ఎస్‌ఏను సంప్రదించి, కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జడ్జి కోరారు.
ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా దామోదరబాయి
నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా దామోదరబాయి శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ చంద్రశేఖర్ విధులు నిర్వర్తించారు. బాధ్యతలు స్వీకరించిన ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ దామోదరబాయికి హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్, ఆర్‌ఎంఓలు, వైద్యు సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సన్మానించారు.
అనధికార లేఔట్లపై చర్యలు
వర్ధన్నపేట: అనధికార లేఔట్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా టౌన్ అండ్ ప్లానింగ్ ఆఫీసర్(డీటీసీపీఓ) జ్యోతి హెచ్చరించారు. మండలంలోని ఇల్లంద గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శనివారం ఆమె సందర్శించారు. పలు అభివృద్ధి పనులు, లేఔట్లు, పంచాయతీ రికార్డులు, పౌర సేవల చార్ట్‌ను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి శంకర్‌రావు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లౌఔట్‌కు అనుమతులు పొందాలన్నారు. అ భివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: క్రిసిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు కుట్టుమిషన్లు, ఈ–బైక్‌లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ పథకం కోసం ఈనెల 18లోగాలోగా tgobmms. cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రైతు భరోసా నిధుల జమ
ఖిలా వరంగల్: జిల్లాలో 6 ఎకరాల్లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిందని జిల్లా వ్యవసాయాఽధికారి విజయ నిర్మల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 1,55,396 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.145.99 కోట్లు భరోసా నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు.
శాంతివనంలో అడవి బాదం
నర్సంపేట: నర్సంపేటకు చెందిన వనప్రేమి గోకా రామస్వామి పది సంవత్సరాల క్రితం యానాం నుంచి తెచ్చిన అడవి బాదం విత్తనాన్ని శాంతివనంలో నాటాడు. 30 అడుగుల వరకు పెరిగిన ఆ చెట్టు ఇప్పుడు కాయలు కాస్తోంది. శనివారం గాలి వానకు కొన్ని కొమ్మలు విరిగాయి. వాటికి కాసిన ఈ కాయలు చూడడానికి బాలా బాగున్నాయి. లోపల ఉన్న తామర గింజల మాదిరిగా ఉన్నవాటిని చాలా మంది ఇష్టంగా తింటారు.


