రామన్నపేట: హనుమకొండ డీఎంహెచ్‌ఓ రామ్‌కుమార్ వైద్యులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలతో పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళన చేయడంతో సెలవులో వెళ్లిపోయారు. ఈక్రమంలో శనివారం ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ మదన్‌మోహన్ బాధ్యతలు తీసుకున్నారు. హసన్‌పర్తి డిప్యూటీ సివిల్ సర్జన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణారావును డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డిలతో పాటు ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.
వరంగల్ క్రైం: ఆరోగ్యం బాగుండాలంటే దినచర్యలో మార్పు అవసరమని వరంగల్ సీపీ ఎస్.శ్వేత అన్నారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను ఆమె పర్యవేక్షించారు. సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, శారీరక దృఢత్వంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణకు రోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సత్యనారాయణ, ఆర్‌ఐలు స్పర్జన్‌రాజ్, సతీశ్, శ్రీధర్, చంద్రశేఖర్, ఉదయ్‌భాస్కర్, ఇన్‌స్పెక్టర్లు వెంకన్న, సువర్ణ, సుజాత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కేయూలో శనివారం మూడు విభాగాల్లో కంప్యూటర్‌సైన్స్, ఫిజిక్స్, కామర్స్ విభాగాల్లో డిపార్ట్‌మెంటల్ కమిటీలు, సబ్జెక్టుల ఎక్స్‌పర్ట్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హాజరైన అభ్యర్థులకు డెమోలు నిర్వహించారు. కామర్స్ విభాగంలో ఇంటర్వ్యూలకు 69 మంది అభ్యర్థులను పిలవగా 58 మంది, ఫిజిక్స్‌లో 16 మంది అభ్యర్థులకుగాను 9 మంది, కంప్యూటర్ సైన్స్‌లో 19 మందికి 14మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఖిలా వరంగల్: ఈనెల 6న వరంగల్ ఎంజీఎం జంక్షన్‌లోని వెంటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ (వీసీసీ)లో పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ నిరోధక టీకాలు వేయనున్నట్లు ఎంజీఎం సమీపంలోని పశువైద్య శాల డాక్టర్ అంబిక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధి పశువైద్య కళాశాల మామునూరు, వరంగల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు వేయించాలని కోరారు.
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 18న ప్రత్యేకలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎల్‌ఎస్‌ఏను సంప్రదించి, కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జడ్జి కోరారు.
న్యూశాయంపేట: క్రిసిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు కుట్టుమిషన్లు, ఈ–బైక్‌లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈపథకం కోసం ఈనెల 18లోగాలోగా tgobmms. cgg. gov.inలో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.


