ఉద్యోగాల పేరుతో దళారుల దందా! | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో దళారుల దందా!

Jul 5 2026 2:06 AM | Updated on Jul 5 2026 2:06 AM

ఉద్యోగాల పేరుతో దళారుల దందా!

ఉద్యోగాలు ఇస్తామనే పుకార్లు నమ్మవద్దు..

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఇక వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారనుంది. మరో మూడునాలుగు నెలల్లో ఎంజీఎంను 24 అంతస్తుల భవనంలోకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు దళారులు కొత్త దవాఖానలో ఉద్యోగాలిప్పస్తామని దందా చేస్తున్నట్లు సమాచారం. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి 788 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పత్రికల్లో వచ్చిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు బయటివారితో కలిసి ఈ దందాకు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త భవనం ప్రారంభం కాగానే పోస్టులను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇస్తుందని, అందులో ఉద్యోగాల భర్తీ చూసుకుంటామని నమ్మిస్తున్నట్లు చెబుతున్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు బేరం పెడుతూ, అడ్వాన్స్‌గా డబ్బులిస్తేనే జాబితాలో ఉంటారని చెబుతున్నారు. ఎంజీఎంలో ఇప్పుడున్న కాంట్రాక్టు ఈ నెలతోనే అయిపోతుందని, కొత్తవారు వచ్చేవరకు వారుంటారని, ఆ తర్వాత మీకే ఉద్యోగాలిప్పిస్తామని దళారులు బేరసారాలు సాగిస్తున్నట్లు చర్చి జరుగుతోంది. ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులు వారి మాట లు నమ్మకుండా ఎంజీఎంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్యులను అడిగి క్లారిఫై చేసుకోవడంతో వారి దందా బయటపడుతోంది. అలాగే, ఎంజీఎంలో పనిచేసిన వారిని కూడా ఉద్యోగాలు, దళారుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకు ఈ ఉద్యోగాలకు జీఓ రాలేదు, పోస్టుల వివరాలు రాలేదు, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు. నోటిఫికేషన్‌ కూడా రాకున్నా దళారుల మాయలో నిరుద్యోగులు పడే అవకాశం లేకపోలేదు.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దు. దళారుల జోలికి వెళ్లి మోసపోవద్దు. ఎలాంటి ఉద్యోగాలైనా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఉద్యోగాల నియామకంపై ఎలాంటి సమాచారం లేదు. అనవసరంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దళారుల వలలో పడొద్దు. దళారుల సమాచారం తెలిస్తే కలెక్టర్‌, ఏసీబీ, ఇన్‌చార్జ్‌కు తెలియజేయండి. – డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి,

ఎంజీఎం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో

కొలువులు ఇప్పిస్తామని బేరసారాలు

అడ్వాన్స్‌ డబ్బులు ఇస్తే జాబితాలో

ఉంటారని నిరుద్యోగులకు గాలం

ఎలాంటి పుకార్లు నమ్మొద్దని అధికారుల సూచన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement