20 ఏళ్ల తర్వాత పాఠశాల పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల తర్వాత పాఠశాల పునఃప్రారంభం

Jul 4 2026 2:31 AM | Updated on Jul 4 2026 2:31 AM

గీసుకొండ: సూర్య తండాలో 20 సంవత్సరాల క్రితం మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎట్టకేలకు తెరుచుకుంది. సర్పంచ్‌ బానోత్‌ రాఘవేంద్ర ప్రత్యేక చొరవ తీసుకుని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, గీసుకొండ మండల విద్యాశాఖధికారి రవీందర్‌తో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం డీఈఓ, ఎంఈఓ పాఠశాలను పరిశీలించి నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామస్తులతో మాట్లాడి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవాభావం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాల గురించి వివరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించే తల్లిదండ్రుల ఇంటి పన్ను, నల్లా పన్నులు గ్రామపంచాయతీకి తానే చెల్లిస్తానని సర్పంచ్‌ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 20 ఏళ్ల తర్వాత పాఠశాల పునః ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా నియమితులైన ఇద్దరు ఉపాధ్యాయులు, గీసుకొండ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ శరత్‌, సూర్య తండా ఉపసర్పంచ్‌ వాంకుడోత్‌ రాధ, గ్రామపంచాయతీ కార్యదర్శి వీరేశ్‌కుమార్‌, కాంగ్రెస్‌ గ్రామ మాజీ అధ్యక్షుడు లావుడియా రాజన్న, పాలకవర్గ సభ్యులు, గ్రామలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కీటక జనిత వ్యాధులను నియంత్రించాలి

నర్సంపేట: ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి, కీటక జనిత వ్యాధులను నియంత్రించాలని జిల్లా మలేరియా అధికారి రజిని సూచించారు. నర్సంపేట డివిజన్‌ పరిధిలోని పారా మెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగీపై అవగాహన కల్పించాలన్నారు. దోమ పుట్టకుండా, కుట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన డెంగీ, మలేరియా కేసుల గురించి సమీక్షించి విధుల్లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ జేతురాం, హెచ్‌ఈఓ సదానందం, సూపర్‌వైజర్లు దామోదర్‌రెడ్డి, రాజు, కీర్యా, హెల్త్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, టీహబ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పాడి గేదెలతో స్థిరమైన ఆదాయం

సంగెం/గీసుకొండ: రైతులు వ్యవసాయంతోపాటు పాడి గేదెల పెంపకంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చునని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు సభ్యులు రాజేశ్వరి అన్నారు. సంగెం మండల కేంద్రంలోని విజయ డెయిరీ, చింతలపల్లి, గీసుకొండ మండలం మరియపురం, ఊకల్‌ హవేలీ గ్రామాలను శుక్రవారం ఆమె సందర్శించారు. పాడి రైతులను కలిసి క్షేత్రస్థాయిలో పరకాల డెయిరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాడి పశువులు, పాల దిగుబడి, మార్కెటింగ్‌, పాల నాణ్యత తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు మేనేజర్‌ డాక్టర్‌ అరుణ్‌, అంజనాశేషు, డిప్యూటీ మేనేజర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌రావు, డీఆర్‌డీఓ నాగపద్మజ, ఏడీఆర్‌డీఓ శ్రీనివాస్‌, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి బాలకృష్ణ, ఇందిరా మహిళా డెయిరీ జీఎం కృష్ణ, డీపీఎం వరలక్ష్మి, ఏపీఎంలు సారయ్య, ఈశ్వరయ్య, రాజ్‌కుమార్‌, సంగెం మండల సమాఖ్య అధ్యక్షురాలు ఉమాదేవి, గీసుకొండ ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక, కాంగ్రెస్‌ సంగెం మండల అధ్యక్షుడు ఇండ్ల రవికుమార్‌, నాయకులు మాధవరెడ్డి, బండి రాధిక, సీసీలు సురేశ్‌, నర్సయ్య, శ్రీలత, మరియపురం సర్పంచ్‌ తిరుమలరెడ్డి అర్పితరెడ్డి, దిలీప్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ శివప్రసాద్‌, వీఓ జ్యోతి, సంధ్య, వీఓఏలు జయలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement