● సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
● తల్లిదండ్రులతో కలిసి నెక్కొండ గురుద్వార్‌లో పూజలు
నెక్కొండ: మండల కేంద్రంలోని గురుద్వార్‌లో ఉన్న 200 సంవత్సరాల నాటి పవిత్ర గ్రంథం, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు సంరక్షించాల్సిన అవసరం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ (డీఐజీ) సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన తల్లిదండ్రులతో కలిసి గురుద్వార్‌ను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీఐజీ, వారి కుటుంబ సభ్యులకు సిక్కు మతపెద్దలు స్వాగతం పలికారు. అనంతరం గురుద్వార్‌లోని 200 ఏళ్లనాటి పవిత్ర గ్రంథాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించారు. ఈ సందర్భంగా సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మాట్లాడుతూ గురుద్వార్‌లోని ఆధ్యాత్మిక వాతావరణం ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. సిక్కు సంఘం సభ్యులను కలిసి గురుద్వార్ చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత, గ్రంథం ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేందర్, గురుద్వార్ నిర్వాహకులు సర్దార్ దర్బార్‌సింగ్, సర్దార్ ప్రేంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి కళాశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులు, చెల్లించాల్సిన ఫీజు, అవసరమైన ఇతర పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. సమయానికి హాజరై అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.


