కేజీబీవీల్లో సీట్లు ఖాళీ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో సీట్లు ఖాళీ

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

కాళోజీ సెంటర్‌: పేద, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికల కోసం ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. అయితే, జిల్లాలోని కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. మొత్తం 10 కేజీబీవీలు ఉండగా.. అందులో 6 తరగతి నుంచి 10వ తరగతి వరకు 183 సీట్లు, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సులకు సంబంధించి 168, ద్వితీయ సంవత్సరంలో 247 సీట్లు ఖాళీలు ఉన్నాయి.

అందుబాటులో 3,280 సీట్లు..

అన్ని కేజీబీవీల్లో కలిపి మొత్తం 3,280 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు కేవలం 2,682 (84 శాతం) మంది విద్యార్థినులు మాత్రమే ప్రవేశాలు పొందారు. ఇంకా 598 (16 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రచార లోపమో, పర్యవేక్షణ లోపమో కానీ.. అర్హులైన పేద విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ప్రతి పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి 40 సీట్ల చొప్పున 200 మంది, ఇంటర్‌లో డబుల్‌ స్ట్రీం కాలేజీల్లో 160 (మొత్తం 360 సీట్లు) సీట్ల సామర్థ్యం ఉంది. ఈ ఏడాది నెక్కొండ కేజీబీవీకి కొత్తగా ఎంఎల్‌టీ కోర్సు మంజూరైంది.

ఆయా కేజీబీవీల్లో కోర్సులు ఇలా..

చెన్నారావుపేట, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఖానాపురం, రాయపర్తి, వర్ధన్నపేటలో ఎంపీసీ, బైపీసీ, దుగ్గొండి, పర్వతగిరి, నెక్కొండలో ఎమ్మెల్టీ కోర్సు ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి మూడు కేజీబీవీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థినులను జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయనున్నారు.

విద్యార్థినులకు శిక్షణ..

జిల్లాలోని పలు కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రభుత్వం పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఖానాపురం కేజీబీవీలో నీట్‌ శిక్షణ కేంద్రం, వర్ధన్నపేటలో జేఈఈ, ఐఐటీ శిక్షణ కేంద్రం, గీసుకొండలో క్లాట్‌ (లా ప్రవేశ పరీక్ష) శిక్షణ కేంద్రం నిర్వహించనున్నారు.

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు..

మూడు ప్రతిష్టాత్మక ‘యంగ్‌ ఇండియా’ కేంద్రాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష టీజీఆర్‌జేసీ ద్వారా పూర్తి కాగా.. ఆరో తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 12న మూడు కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఖాళీలను ఎస్‌ఓలు భర్తీ చేస్తారు..

జిల్లాలో ఉన్న 10 కేజీబీవీల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన చేస్తున్నాం. అన్ని తరగతుల్లో కలిపి 598 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆయా కేజీబీవీల ఎస్‌ఓలు ఖాళీలను భర్తీ చేయడానికి కృషిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘యంగ్‌ ఇండియా’ కేంద్రాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహిస్తాం.

– కొల్లూరి ఫ్లోరెన్స్‌, జీసీడీఓ

ఇప్పటివరకు 84 శాతం ఎన్‌రోల్‌మెంట్‌

యంగ్‌ ఇండియా స్కూళ్లుగా

3 విద్యాలయాలు అప్‌గ్రేడ్‌

ఈనెల 12న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అధికారుల ఏర్పాట్లు

వివిధ కోర్సుల్లో ఖాళీల వివరాలు..

తరగతులు ఇంటర్‌

కేజీబీవీ (6–10 వరకు) ఫస్టియర్‌ సెకండియర్‌

చెన్నారావుపేట 0 13 28

దుగ్గొండి 9 18 19

గీసుకొండ 20 20 0

ఖానాపురం 0 19 51

నల్లబెల్లి 20 15 00

నెక్కొండ 58 32 00

పర్వతగిరి 5 7 23

రాయపర్తి 12 34 52

సంగెం 0 0 55

వర్ధన్నపేట 59 10 19

మొత్తం 183 168 247

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement