న్యూశాయంపేట: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతను కమిషనరేట్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల సత్వర పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన అవసరాన్ని ఇరువురు అధికారులు ప్రస్తావించారు.
18న ప్రత్యేక లోక్ అదాలత్
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెల 18న చెక్‌బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మపర్సన్లు వీబీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ కోసం ఇప్పటి వరకు వరంగల్‌లో 2,364 ఎన్‌ఐ యాక్ట్ కేసులు, హనుమకొండలో 4,362 ఎన్‌ఐ యాక్ట్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులను పరిష్కరించేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్‌పై ఎటువంటి సలహాలు, సందేహాలు, న్యాయ సాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. న్యాయమూర్తి జె.మైత్రేయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ ఉపేందర్ ఉన్నారు.
సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి
రాయపర్తి: సర్ సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. తిర్మలాయపల్లి, కొండూరు గ్రామాలను గురువారం ఆమె సందర్శించి సర్వేను పరిశీలించారు. అనంతరం సర్ సర్వేతోపాటు సాదాబైనామా దరఖాస్తులపై మండల కేంద్రంలోని తహసీల్లార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
‘పీఎం సూర్యఘర్’ను వినియోగించుకోవాలి
నర్సంపేట: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని టీజీ రెడ్‌కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ముకుల్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్‌తో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, టీజీ రెడ్కో ఫీల్డ్ ఆఫీసర్ నవీన్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనకునే పేద ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి తెలిపారు. అర్హులు www.telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.


